కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాల విద్యార్థులకు జరగాల్సిన తుది పరీక్షలు వాయిదా పడ్డాయి. పదో తరగతి సహా అనేక తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ ఏడాది పలు తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు, మరికొందరికి సాధారణ తరగతులు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం వీలును బట్టి మరికొద్ది రోజుల్లోనే అన్ని తరగతుల విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు ప్రారంభించాలని భావించింది.
అయితే తాజాగా ఒకటి నుంచి ఐదవ తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఐదవ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది బోధన వద్దని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అయితే 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు మాత్రం కొన్ని రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇంటర్, డిగ్రీ తరగతులను జనవరి 2వ తేదీ నుంచి మొదలుపెట్టాలని అధికారులు భావించారు. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.