నెట్టింట సరికొత్త యుద్ధం… ఫ్యాన్ రెక్కలు వర్సెస్ గ్లాసు ముక్కలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మైకుపట్టుకున్న ప్రతీసారీ తన ప్రభుత్వం చేసిన మంచి గురించి చెబుతూనే… విపక్షాలపై సెటైర్లు విసురుతున్నారు. తాజాగా రాప్తాడులో జరిగిన సభలో అయితే… ప్రాసలతో విరుచుకుపడ్డారు. అందులో ప్రధానంగా “సింక్ లో గ్లాసు” అనే డైలాగ్ కి భారీ స్పందన వచ్చింది. దీంతో… ఈ విషయంపై నెట్టింట సరికొత్త యుద్ధం మొదలైంది.

అవును… కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా జరిగిన రాప్తాడు “సిద్ధం” సభలో వైఎస్ జగన్ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూసిన ఉత్సాహంలోనో ఏమో కానీ… యతిప్రాసలతో ప్రతిపక్షాలపై పంచులు వేశారు జగన్. ఇందులో భాగంగా.. “ఇంట్లో ఫ్యాన్, ఇంటి బయట సైకిల్, సింక్ లో గ్లాస్” అనే డైలాగ్ వైరల్ అవుతుంది. ఈ సమయంలో నాగబాబు స్పందించారు.

ఇందులో భాగంగా… “గ్లాస్ సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది, కాని ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదు.. అయినా సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధ లో సగం ప్రజాపరిపాలన మీద పెట్టుంటే బాగుండేది… ఐయాం టెల్లింగ్ దట్” అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగుల స్టైల్లో ఒక ట్వీట్ చేశారు.

దీంతో… నాగబాబుపై నెట్టింట ట్రోలింగ్ మొదలైపోయింది. ఇదే సమయంలో… గతంలో టీడీపీని ఓడించాలని, సైకిల్ ని కిందపడేసి తొక్కాలని నాగబాబు చెప్పిన మాటల వీడియోలను వెలుగులోకి తెస్తున్నారు. దీంతో నెట్టింట రసవత్తర రచ్చ మొదలైంపోయింది. విరిగిన ఫ్యాన్ రెక్కల ఫోటోలు ఒకరు పోస్ట్ చేస్తుంటే… సింక్ లోకి విరిసి పాడేస్తున్న గ్లాసు వీడియోలు మరొకరు పోస్టు చేస్తున్నారు.

ఈ క్రమంలో… “ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి.. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే కిందపడేసి తొక్కండి” అంటూ చేసిన వీడియోని మళ్లీ తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేటిజన్లు! ఇదే సమయంలో… “మహా నటుడు” అంటూ నాగబాబుని వెటకారం చేస్తున్నారు. ఇదే క్రమంలో… “మీరు ప్యాకేజీ మీద పెట్టిన శ్రద్ధలో సగం.. జనసేన పార్టీపై పెట్టుంటే కనీసం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అయి ఉండేవారు” అంటూ ఆటాడేసుకుంటున్నారు.

ఇదే సమయంలో… “ఫ్యాన్ రెక్కలు విరిగితే రిపేర్ చేసుకోవచ్చు.. గ్లాసు పగిలితే మాత్రం దేనికీ పనికి రాదు” అంటూ నెటిజన్లు నాగబాబుకి కౌంటర్లిస్తున్నారు. ఇలా సాగుతున్న ఫైట్… ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.