ఛలో మంగళగిరి అంటున్న ఆంధ్రా పార్టీలు.. ఎందుకంటే ?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్ర రాజధానిలో తమ పార్టీ ఆఫీసులను సంసిద్ధం చేస్తున్నాయి. రాజధానిలో కార్యాలయం ఉంటే కార్యకర్తలను కలుసుకోవడానికి, ప్రజల్లోకి నేరుగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలకు అడ్డాగా మారింది మంగళగిరి. ఎందుకంటే.. అమరావతి, గుంటూరు, విజయవాడకు మంగళగిరి కేంద్రబిందువుగా ఉంటుంది. అన్ని విధాలా అందుబాటులో ఉంటుంది. అందుకే మంగళగిరి మీదుగా వెళ్లే 16 వ నేషనల్ హైవే పక్కగా తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి నాలుగు ప్రధాన పొలిటికల్ పార్టీలు. మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం, తాడేపల్లి పట్టణంలో వైసీపీ కార్యాలయం, పాత సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో బీజేపీ కార్యాలయం, చిన్న కాకానికి దగ్గరలో జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లోనే అన్ని పార్టీల ప్రధాన కార్యాలయాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని బంజారాహిల్స్ లో పెద్ద ఆఫీసు ఉంది. అలాగే నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి గాంధీభవన్ ఉంది. ఇక బిజెపికి కూడా నాంపల్లిలోనే శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్ ఉంది. ఇక వైసిపి కి లోటస్ పాండ్ లో జగన్ ఇంటిలోనే ఆఫీసు ఉంది. జనసేనకు హైదరాబాద్ లో పర్మినెంట్ ఆఫీసు లేదు. రాష్ట్ర విభజన జరగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రాలో పర్మినెంట్ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాయి. వైసిపి ఇక్కడ దుకాణం వేసేసింది. దీంతో లోటస్ పాండ్ కేవలం జగన్ నివాసంగానే మారిపోయింది. అడపాదడపా పార్టీ సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఇక టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూడా హడావిడి తగ్గింది. దీంతో ఆ పార్టీ ఆంధ్రాలోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు దిశగా కసరత్తు జరుపుతున్నది. రోజు రోజుకూ ఆ పార్టీ ప్రభావం తెలంగాణలో తగ్గిపోతూ వస్తున్నది. పవన్ జన సమితి తెలంగాణలో యూత్ లో కొంత ప్రభావం చూపేలా ఉంది. అయితే పవన్ టార్గెట్ కూడా ఆంధ్రానే కావడంతో ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి కూడా ఆంధ్రాకు సొంత పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు ఉన్నప్పటికీ అన్ని పార్టీల ఆంధ్రా నేతలు నాలుగేళ్లు కాకముందే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లారు. ఎందుకంటే ఇక్కడ ఎంతకాలమైతే ఉంటామో అక్కడ అంతమేరకు మైనస్ అవుతుందన్న భావనతో అందరూ కట్టకట్టుకుని ఆంధ్రా రాజధానిలో వాలిపోయారు.

సంక్రాంతికి టీడీపీ ఆఫీస్ ప్రారంభోత్సవం
2017 నవంబర్ 26 న టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు పరిధిలో హ్యాపీ రిసార్ట్స్ ఎదురుగా హైవే ను ఆనుకుని ఉన్న మూడు ఎకరాల అరవై సెంట్ల భూమిలో టీడీపీ సెంట్రల్ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. రెండు బ్లాకుల్లో పెద్ద కాన్ఫరెన్స్ హాల్, చిన్న మీటింగ్ హాల్, డైనింగ్ హాల్, లైబ్రరీ, గెస్ట్ హౌస్ వంటి వసతులు ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు. సంక్రాంతికి ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచనతో వేగంగా పనులు జరిపిస్తున్నారు.

వైసీపీ కార్యాలయం దసరా నాటికి
ఎలాంటి హడావిడి లేకుండా గతేడాది తాడేపల్లిలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వైసీపీ వారు. పార్టీ ఆఫీసుకి దగ్గరలోనే వైసీపీ అధినేత జగన్ ఇంటి నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ రెండింటి నిర్మాణం త్వరగా కానిచ్చేసి దసరాకి వాటిలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారట జగన్.

లేటుగా బయలుదేరిన జనసేన
మొదట జనసేన పార్టీ తమ కార్యాలయ భవనాన్ని చినకాకానిలో ఏర్పాటు చేయాలనుకుని లీజుకు తీసుకున్న కార్యాలయం విషయంలో వివాదం రావడంతో అది వదిలేసుకున్నారు. తర్వాత చినకాకాని దగ్గర్లో ఉన్న కాజా పరిధిలో సాహితి సంస్థ నిర్మిస్తున్న వెంచర్లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. నాలుగు నెలల నుండి పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు పవన్ కళ్యాణ్ నివాస గృహాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఎన్నికలలోపు నిర్మాణం పూర్తి చేసేస్తామని ధీటుగా చెబుతున్నారు జనసేన నాయకులు.

త్వరలో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన
బీజేపీ కూడా రాష్టంలో గట్టిగ పాకా వేయాలి అనుకుంటుంది. అందుకే మంగళగిరికి చుట్టుప్రక్కల ప్రాంతంలో కార్యాలయం నిర్మించాలని చూస్తోంది. అందుకోసం బీజేపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి మాదల శ్రీనివాస్ కొలనుకొండ వద్ద హైవే నుండి సుమారు 800 మీటర్ల దూరంలో ఒక అరెకరం స్థలాన్ని ఇచ్చారు. ఎయిమ్స్ కి సమీపంలో, పాత సిమెంటు ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంది ఈ స్థలం. కానీ అక్కడకు చేరుకునేందుకు రహదారి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. త్వరలోనే శంకుస్థాపన చేసి కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు బీజేపీ నేతలు.