అక్కడి పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు.

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. కేంద్రం పెట్రోల్ పై పన్నులను తగ్గించినా ఏపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ లపై పన్నులను తగ్గించలేదు. అయితే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండగా కర్ణాటకలో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయి. అనంతపూర్, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల వాహనదారులు కర్ణాటక పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.

ఏపీ సర్కార్ అదనపు వ్యాట్ విధించడంతో పాటు రోడ్డు అభివృద్ధి సెస్ ను వసూలు చేయడం కూడా వాహనదారుల అభిప్రాయం మారడానికి కారణమవుతోంది. ఏపీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా 112 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 107.50 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర 98.50 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 95.21 రూపాయలుగా ఉండటం గమనార్హం.

రెండు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం 12 నుంచి 14 రూపాయలుగా ఉంది. ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు మాత్రం ఇతర రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది వాహనదారులు ఏపీ సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో అయినా ఏపీ సర్కార్ వ్యాట్, సెస్ లను తగ్గిస్తే మంచిది. అలా జరగని పక్షంలో ఏపీలోని పదుల సంఖ్యలో పెట్రోల్ బంకులు మూతబడే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలలోని కొన్ని పెట్రోల్ బంకులు పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువని ప్రకటనలు ఇస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని కర్ణాటక పెట్రోల్ బంకులు వాహనదారులతో కళకళలాడుతుంటే ఏపీ పెట్రోల్ బంకులు మాత్రం వాహనదారులు లేక వెలవెలబోతున్నాయి.