పవన్ కు షాక్… ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా “బీసీవైపీ”?

ఏపీలో ఇప్పటికే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి వైఎస్సార్సీపీ కాగా.. మరొకటి టీడీపీ! ఈ సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ వస్తే కచ్చితంగా ప్రయోజనం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు అతీతంగా మరో పార్టీ పుట్టాలని చాలా మంది భావించారని చెబుతుంటారు. ఈ సమయంలో జనసేన పుట్టింది.

అవును… కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన పార్టీలు కాకుండా.. ఇప్పటివరకూ అధికారానికి నోచుకోలేని, పైగా అధిక జనాభా కలిగిన ఎస్సీ-బీసీ లకు ప్రాతినిధ్యం వహించే పార్టీ ఒకటి పుట్టాలని చాలామంది కోరుకున్నారు! ఈ సమయంలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఒక పార్టీ పెట్టారు. అసలే చీకటి గాండాంధకారం.. చేతిలో దీపం లేకపోయినా గుండెల నిండా ధైర్యం ఉందని చెప్పారు. ప్రశ్నించడానికే ఈ పార్టీ అని అన్నారు.

అయితే ఎంటరవ్వడం ఎంటరవ్వడమే టీడీపీ-బీజేపీ ప‌ల్లకీ మోయాలని ఫిక్సయ్యారు. అప్పుడు ఎత్తుకున్న పల్లకి కాడే ఇప్పటివరకూ దించినట్లు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయం జనసేన కాదని… ప్రస్తుతం ఏపీలో కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లతో పాటు జనసేన కూడా ఒకటని ఒక క్లారిటీ మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయ తెర‌పై కొత్త పార్టీ అవ‌త‌రించింది. ప్రధానంగా అధికారం అణ‌గారిన వ‌ర్గాల‌కు రావాల‌నే నినాదంతో చిత్తూరు జిల్లాకు చెందిన రామ‌చంద్ర యాద‌వ్ కొత్తగా రాజ‌కీయానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సందర్భంగా… గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ వ‌ద్ద నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో “భారత చైతన్య యువజన పార్టీ” అని త‌న కొత్త పార్టీ పేరును ప్రక‌టించారు.

ఈ సందర్భంగా మైకందుకున్న రామ‌చంద్రయాద‌వ్… మూడో ప్రత్యామ్నాయం అంటే ఎలా వుండాలో చూపారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ, వైసీపీల‌ను ఏకిపారేశారు. తాను ఇద్దరికీ స‌మాన దూర‌మ‌ని విమ‌ర్శల ద్వారా ధైర్యంగా ప్రకటించారు. సాధారణంగా మూడో ప్రత్యామ్నాయం అవ్వాలంటే ఇది బేసిక్ సూత్రం అని గుర్తించారు.

ఏపీలో ఐదారు శాతం జ‌నాభా క‌లిగిన క‌మ్మ, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులే ప‌రిపాలిస్తున్నార‌ని.. త‌మ‌కు అధికారం ద‌క్కలేద‌నే బాధ‌, ఆవేద‌న మిగిలిన సామాజిక వ‌ర్గాల్లో వుంది. ఆ ఆవేద‌న‌, ఆక్రోశాన్ని రాజ‌కీయంగా మార్చాలనే త‌ప‌న రామ‌చంద్ర యాద‌వ్‌ లో క‌నిపిస్తోందని తెలుస్తోంది. అత‌ని ప్రసంగంలో ఎక్కడా డొంక తిరుగుడు లేదు.. నిఘా వర్గాల సమాచారంతో కూడిన విమర్శలు లేవు.. నేరుగానే టీడీపీ, వైసీపీ పాల‌న‌ల‌ను ఆయన తూర్పార ప‌ట్టారు.

దీంతో… రామచంద్రయాదవ్ ని చూసి పవన్ కల్యాణ్ చాలా నేర్చుకోవాలని అంటున్నారు పరిశీలకులు. ప్రశ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని ప్రగ‌ల్భాలు ప‌లికి, టీడీపీ-బీజేపీ ప‌ల్లకీ మోయ‌డానికి కుదురుకున్న ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ కు మూడో ప్రత్యామ్నాయం అంటే ఎలా వుండాలో రామ‌చంద్రయాద‌వ్ చూపారని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ పార్టీ భ‌విష్యత్ ఏంట‌నేది ఇప్పుడు చెప్పలేం కానీ… టార్గెట్ అయితే క్లియర్ గా ఉందని తెలుస్తుంది.