మునిసి’పోల్స్’: ఓటరు చైతన్యం.. రాజకీయ పైత్యం.!

AP Municipality Election polling Started

AP Municipality Election polling Started

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కుని ఆయా పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకుంటున్నారు. యువత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వైపు అడుగులేస్తున్నట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అనారోగ్యంతో మంచాన పడ్డ వృద్ధులు కూడా సహాయకుల్ని వెంటేసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు ఓటు వేసేందుకోసం. ‘చాలాకాలం తర్వాత మునిసిపల్ ఎన్నికల కోసం ఓట్లు వేస్తున్నాం..’ అని కొందరు ఓటర్లు మురిసిపోతున్నారు. మరోపక్క, విపక్షాల మద్దతుదారులన్న కోణంలో చాలా ఓట్లు తొలగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు హక్కు లేకపోవడంతో కొందరు నిరాశగా వెను దిరుగుతోంటే, కొందరు పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. మరోపక్క, పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో ప్రలోభాల పర్వం కనిపిస్తోందంటూ ఆయా ప్రాంతాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలదాకా సమర్పించుకుంటున్నారు అభ్యర్థులు గెలుపుకోసం.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. ప్రదాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను చివరి నిమిషం వరకు ప్రలోభ పెట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తుండడం ప్రజాస్వమ్యాన్ని పరిహసించడమే. ఈ ఎన్నికలు అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ‘చావో రేవో’ తేల్చుకోవడానికి సిద్ధమయ్యింది. జనసేన పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఎన్నికల ప్రచారం పరంగా గట్టిగానే కృషిచేసింది. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారిగా మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేశారు. నిన్ననే హైద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అభిమానిని మార్గమధ్యంలో పరామర్శించి, 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీన్ని ఎన్నికల స్టంటుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభివర్ణిస్తున్నారు.