యాత్ర కాదది యాతన.. అంటూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర విషయమై సెటైర్లు పడుతున్నాయి. అధికార వైసీపీ, ఈ యాత్రను అత్యంత హేయంగా చూస్తోంది. దారుణమైన రీతిలో ట్రోలింగ్ కూడా చేస్తోంది. మరోపక్క, తెలుగుదేశం పార్టీ మాత్రం ‘యువగళం’ పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తూనే వుంది. అను నిత్యం నారా లోకేష్ వెంట నడిచేందుకోసం ప్రత్యేకంగా నెలవారీ జీతాలు చెల్లించి మరీ కార్యకర్తల్ని నియమించినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
‘అదంతా అధికార పార్టీ కుట్ర పూరిత ప్రచారం..’ అంటోంది టీడీపీ. ఆ సంగతి పక్కన పెడితే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడింటికి మూడింటినీ గెలుచుకోవడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓ సీటుని గెలుచుకోవడం.. వెరసి, ఇదంతా నారా లోకేష్ పాదయాత్ర ఘనతేనని టీడీపీ చెప్పుకుంటోంది.
ఇంతకీ, నారా లోకేష్ ఖాతాలో ఈ ఘనతల్ని వేసెయ్యొచ్చా.? అంటే, ఏమోగానీ.. ఆ దిశగా టీడీపీ అయితే గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ, టీడీపీలోనే అంతర్గతంగా ‘యాత్ర కాదది యాతన’ అనే చర్చ జరుగుతుండడం గమనార్హం. అలాంటప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల క్రెడిట్, లోకేష్ ఖాతాలో ఎలా వేస్తారు.?
లోకేష్ పాదయాత్ర సందర్భంగా అధికార వైసీపీ నుంచి ఎవరూ టీడీపీలో చేరేందుకు ప్రజా ప్రతినిథులెవరూ ముందుకు రావట్లేదంటే దానర్థమేంటి.? మామూలుగా అయితే, ఇలాంటి యాత్రల్లో అలాంటివే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుంటాయి. ఏమో, ముందు ముందు అలాంటి వాటిని కూడా చంద్రబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారేమో.!