ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంలో అందరికంటే ముందు ఉంటారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మూడు దఫాలుగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. 1999లో చివరిసారిగా ఆయన నెగ్గారు. ఆ తరువాత అసెంబ్లీకి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అయినప్పటికీ..జగన్‌పై క్రమం తప్పకుండా విమర్శలు చేయడం వల్లే చంద్రబాబు ఆయనకు మంత్రిపదవి ఇచ్చారనే టాక్ నెల్లూరు జిల్లాలో ఎవర్ని అడిగినా చెబుతారు.
అలాంటి సోమిరెడ్డి తన కుటుంబంలోని ఓ వ్యక్తి వైఎస్ఆర్ సీపీలో చేరుతుంటే అడ్డుకోలేకపోయారు. ఆయనే బావ రామకోట సుబ్బారెడ్డి. సోమిరెడ్డి చెల్లెలి భర్త. తన ఇద్దరు కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డిలతో కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆయన చేరిక వెనుక వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. సంక్రాంతి పండుగనాడు వేమిరెడ్డి రామకోట ఇంటికి వెళ్లి భోజనం చేశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పుడే రామకోట సుబ్బారెడ్డి చేరిక ఖాయం అనే వార్తలు వెలువడ్డాయి. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నాయకులు ఆ వార్తలను తోసిపుచ్చారు. ఆయన ఏ పార్టీలో చేరరని, తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా 10 రోజులు తిరిగే సరికి రామకోట వైఎస్ఆర్ సీపీలో చేరారు.
నెల్లూరుజిల్లాలో ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది. గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓడిపోవడానికి కారణం అదే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నెల్లూరు జిల్లాలో చోటు చేసకున్న అభివృద్ధి పనులే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు.