హోం మంత్రి మేకతోటి సుచరితకి షాక్ తప్పదా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సుచరిత ఓ సందర్భంలో తాను క్రిస్టియన్.. అని చెప్పుకున్నారు. ఆ విషయాన్ని పట్టుకుని కొందరు, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్, నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ షురూ అయ్యింది. విచారణలో ఏం తేలబోతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. హోం మంత్రి మేకతోటి సుచరిత తాను ఏసుక్రీస్తుని విశ్వసిస్తున్నానని చెప్పడాన్ని తప్పు పట్టలేం. మన దేశంలో ఎవరైనా, ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చు. ఆ మత ఆచారాల్ని పాటించొచ్చు. కానీ, కన్వర్షన్.. మత మార్పడి అనేదే కీలకం. మేకతోటి సుచరిత, మతం మార్చుకున్నారా.? లేదా.? అన్నదే కీలకం. ఒకవేళ మతం మార్చుకుని వుంటే మాత్రం, దళిత కోటాలో ఆమె ప్రజా ప్రతినిథి అవడం కూడా చెల్లకపోవచ్చు.

మంత్రి పదవి విషయంలో వచ్చే ఇబ్బంది ఏమీ వుండదామెకి. అయితే, ఇది ఇప్పటికిప్పుడు తేలే అంశమే కాదు. ఇలాంటివి చాలానే జరిగాయి, జరుగుతూనే వున్నాయి.. ముందు ముందు కూడా జరుగుతూనే వుంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ఏ మతం.? అన్నదానిపైనా భిన్న వాదనలున్నాయి. ఆ మధ్య ఇదే అంశంపై కోర్టులో కేసు కూడా నమోదయ్యింది.. పిటిషన్ వేసిన వ్యక్తికి చీవాట్లు కూడా పడ్డాయి. ఇదిలా వుంటే, కేవలం మేకతోటి సుచరిత మాత్రమే కాదు, మరో ఎమ్మెల్యే శ్రీదేవి.. ఇంకొందరు వైసీపీ ప్రజా ప్రతినిథుల మీద కూడా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారంపైనా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అమలాపురం ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ విషయంలోనూ ఇవే తరహా ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.