ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
అలాగే , తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ఫిబ్రవరిలో జరపతలపెట్టిన స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నవంబర్‌లో ప్రొసీడింగ్స్ జారీ చేసింది. అయితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు జరపలేమంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్వర్వులను నిలిపివేయాలంటూ ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెకండ్ వేవ్ కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలపై పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎస్‌ఈసీ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.