ఏపీ సర్కార్ సినిమా టిక్కెట్ షాక్: టాలీవుడ్ పరిస్థితేంటి.?

సినిమా టిక్కెట్ ధరల్ని రెగ్యులేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అసెంబ్లీలో వెల్లడించింది. పెద్ద సినిమాలకీ, చిన్న సినిమాలకీ ఒక్కటే టిక్కెట్.. కేవలం నాలుగు షోలు మాత్రమే వుంటాయ్.. బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అవకాశమే లేదు. ఇదీ వైఎస్ జగన్ సర్కార్ అసెంబ్లీలో తేల్చి చెప్పిన మాట.

వాట్ నెక్సట్‌.? తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.. వాడిగా, వేడిగా. పెద్ద సినిమాలు అదనపు షోలను కోరుతాయి. టిక్కెట్ ధరల్ని పెంచమనీ కోరతాయి. బెనిఫిట్ షోల సంగతి సరే సరి. కానీ, ఇకపై అలా అడగడానికే అవకాశం లేకుండా పోతోంది.

కరోనా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న సినీ పరిశ్రమకు ఇది కోలుకోలేని దెబ్బ. సినీ ప్రేక్షకులకు మాత్రం ఇదో పండగ లాంటి వార్తే. టిక్కెట్ ధరల్ని రెగ్యులేట్ చేస్తే.. ప్రేక్షకులకు ఊరటే కదా మరి.?

అయితే, థియేటర్లలోకి సినిమాలు రాకపోతే పరిస్థితేంటి.! ఎన్ని రోజులని సినిమాల్ని రిలీజ్ చేసుకోకుండా నిర్మాతలు ఆపగలుగుతారు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అదనపు టిక్కెట్ ధరలు లేకుండా, అదనపు షోలు లేకుండా.. పెద్ద సినిమాలు నిలదొక్కుకునే పరిస్థితే వుండదు ఈ రోజుల్లో.

సో, తెలుగు సినీ పరిశ్రమ మైండ్ బ్లాంక్ అయిపోయే వుండాలి. సంక్రాంతి కోసం ముందుగానే పెద్ద సినిమాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నుంచే సినిమాల జాతర మొదలవ్వాలి. మరి, ఆ జాతర కాస్తా ఆగిపోతుందా.? పరిశ్రమ పెద్దలు ఈ విషయమై ఏమంటారో వేచి చూడాల్సిందే.