ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల లబ్ధిని సమర్థవంతంగా అందించేందుకు ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది.
గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ తరహాలోనే ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల వివరాలను పొందుపర్చాలని, ఎప్పటికప్పుడు వాటిని అప్‌డేట్ చేయాలని సూచించారు.
కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని, ప్రభుత్వ సంక్షేమం అవసరమైన కుటుంబాలకు వెంటనే సహాయం అందేలా ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రూపకల్పనపై ఆలోచిద్దామన్నారు. త్వరలోనే నూతన పాపులేషన్ పాలసీని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సులభంగా గుర్తించవచ్చని, అనర్హులను తొలగించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ విధానం వల్ల సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


