అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి చిరకాల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ, పదవీ విరమణ వయస్సు పెంపు, గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వంటి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించింది.
పదవీ విరమణ వయస్సు 62కి పెంపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 42,000 మందికి పైగా ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆశా వర్కర్లు మరో రెండేళ్లపాటు అదనంగా సేవలందించే అవకాశం లభించనుంది.
దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ, దేశంలోనే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పదవీ విరమణ చేసే ఆశా వర్కర్లు, వారు పనిచేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందుకోనున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి సుమారు రూ.645 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ప్రసూతి సెలవుల మంజూరు మరో కీలక నిర్ణయంగా, ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు ఆరు నెలల (180 రోజులు) పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటివరకు ఈ సౌకర్యం లేకపోవడంతో మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ నిర్ణయం తెరదించనుంది.
మంత్రి సత్యకుమార్ ఆర్థిక భారమైనా చారిత్రాత్మక నిర్ణయం ఆర్థికంగా భారమైనప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవల విస్తరణలో ఆశా వర్కర్ల పాత్ర అమూల్యమైనదని ఆయన కొనియాడారు. తల్లీబిడ్డల సంరక్షణ, టీకా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కల్పనలో వారి సేవలు వెలకట్టలేనివని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలపై ఆశా వర్కర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.



