రాజధాని విశాఖ కాదా..? కొత్తగా తెరమీదకొచ్చిన మరొక జిల్లా 

ఏపీలో ప్రజెంట్ నడుస్తున్న హాట్ టాపిక్ రాజధాని మార్పు.  ఆమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచుతూ విశాఖను కీలకమైన పాలనా రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ క్యాపిటల్ గా చేయాలని సీఎం వైఎస్ జగన్ భావించారు.  ఈమేరకు అధికారిక ప్రకటన చేసి శాసనసభలో బిల్లును ఆమోదించారు. కానీ మండలిలో మాత్రం బిల్లు పెండింగ్లోనే ఉంది. అయితే నెల మండలికి బిల్లు పంపి నెల గడిచింది కాబట్టి డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ఈ బిల్లును గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపారు.  రాజ్యాంగం ప్రకారం ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.  ఒక్కసారి ఆయన ఆమోదం తెలిపితే అధికారికంగా మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. 
 
మరోవైపు ప్రభుత్వం మెల్లగా ఆమరావతి నుండి పాలన రాజధానిని విశాఖకు తరలిస్తుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.  కానీ తాజాగా పరిపాలనా రాజధాని విశాఖ కాదని మరొక జిల్లా పేరు తెర మీదకు వచ్చింది.  అదే విజయనగరం జిల్లా.  విజయనగరంలోని భోగాపురం వద్ద రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు భోగట్టా.  ఇప్పటికే భోగాపురం వద్ద సుమారు 500 ఎకరాలను అభివృద్ది చేయడం కోసం సర్కార్ సన్నద్దమైందట.  భోగాపురం విమానాశ్రయానికి చెందిన ఈ 500 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఖరారు చేసి, గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు ప్రణాళికల కాంట్రాక్ట్‌ను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
 
ఢిల్లీలో ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేస్తున్నది కూడా హెచ్‌సీపీ సంస్థే.  ఈ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగిస్తూ మూడు వారాల క్రితం రహస్యంగా అనుమతి ఇచ్చినట్లు సమాచారం.  ఇలా విశాఖను కాదని వేరొక ప్రాంతంలో రాజధానిని కట్టాలని అనుకోవదం వెనుక బలమైన కారణమే ఉందట.  ఇటీవల కాలంలో విశాఖలో వరుసగా గ్యాస్ లీక్ లాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.  పైగా విశాఖకు ప్రకృతి పరమైన ముప్పు కూడా ఉందనే చర్చ కూడా ఉంది.  అందుకే విజయనగరంలో పాలనా రాజధాని అని టాక్.  మరి ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే ప్రభుత్వం నుండి భోగాపురంలోని 500 ఎకరాలను ఎందుకు అభివృద్ది చేయాలనుకుంటున్నది తెలియాలి.