ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై ఎపి సర్కారు స్పందించింది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. జగన్ మీద దాడి చేసిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని తెలిపారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందన్నారు.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం మండలంలోని దనియపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు మంచి సంస్కృతి కాదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజా ప్రతినిధులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యమేమీ లేదని తేల్చి చెప్పారు చినరాజప్ప.
దాడి చేసిన వ్యక్తి సెల్ఫీ దిగుతాను అని జగన్ వద్దకు వచ్చినట్లు తెలిసిందన్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా సెల్ఫీ కోసమే వచ్చాడు కదా అని అనుకున్నారని అంతలోనే దాడి జరిపాడని అన్నారు.