ఏపీ సీఎం వైఎస్ జగన్ నిత్యం ఏదో ఒక సంక్షేమ పథకం అమలుచేస్తూ ప్రజలు మీద కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మిగతా సంగతులు ఎలా ఉన్నా సంక్షేమం భేషుగ్గా అమలవుతుందని జనం మాట్లాడుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల్లో జగన్ కీర్తి నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ఆయన అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. విపక్షాలు రాష్ట్ర అప్పుల్లో మునిగిపోతోందని ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా బీసీల విషయంలో ఎప్పటికప్పుడు నిధులు విడుదలచేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
జగన్ అమలుచేసిన పథకాల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం ఒకటి. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను అందించారు. అప్పుడు చాలామంది మహిళలు సంక్షేమానికి అర్హులైనప్పటికీ వారికి లబ్ది అందలేదని తేలింది. దీంతో ప్రతిపక్షం టీడీపీ గగ్గోలు పెట్టింది. అర్హులైనవారి పేర్లను కావాలనే జాబితాలో చేర్చలేదని, దొంగ లెక్కలు చెప్పి అందరికీ లబ్ది చేకూరిందని డ్రామాలు ఆడుతున్నారని, ఇది పక్కా మోసమని జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు చంద్రబాబు. అప్పుడు మౌనంగానే ఉన్న జగన్ ఇప్పుడు మిగిలిన వారికి కూడ లబ్ది అందేలా చేసి చేతులతోనే సమాధానం ఇచ్చారు.
గతంలో మిస్సైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు 15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమచేశారు. దీంతో 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టైంది. కొత్తగా విడుదల చేసిన నిధులతో కాపుల్లో నెలకొన్న కొద్దిపాటి అసంతృప్తి కూడ మాయమైంది. ఇక ప్రతి ఏటా 3.3 లక్షల మందితో పాటే కొత్తగా చేరే మహిళలకు కూడ ఎలాంటి ఆసల్యం లేకుండా 15 వేల రూపాయల లబ్దిని అందించనున్నారు.