బాబు ఈజ్ బ్యాక్… ఉచితం కాని ఉచిత ఇసుక… పవన్ ఎక్కడ?

సాధారణంగా ఈ జనరేషన్ కు తెలియక పోయినా, ఇటీవల ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటు వేసిన వారికి అవగాహన లేకపోయినా… రాజకీయాల్లో చంద్రబాబుకు ఓ పేరుంది! ఇచ్చిన హామీలను అమలు చేయరు.. అభివృద్ధి అనే బ్రహ్మ పదార్థాన్ని చూపి సంక్షేమ పథకాలు, ఉచిత హామీలను సైడ్ చేస్తారు అని! అయితే ఈ వయసులో, ఈ దశలో బాబు అలా ఆలోచిస్తారని చాలా మంది భావించలేదు.. మారిన బాబుని చూస్తారనుకున్నారు!

కట్ చేస్తే… అదే హామీలు, అవే డైలాగులు, అనుకూల మీడియాలో అవే కవరింగులు, మళ్లీ ప్రజలకు అవే వెన్నుపోట్లు అనే కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. అందుకు కారణం అయ్యింది “ఉచిత ఇసుక” అనే ఎన్నికల హామీ! ఈ ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా… స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో ప్రజానికం ఒక్కసారిగా షాక్ అయ్యింది! బాబు మారలేదనే కామెంట్లకు నెలవైంది!

అవును… ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆదాయం ఇప్పటికే చాలా దారుణంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తానని హామీ ఇచ్చారు.. చంద్రబాబు ఎన్నికల హామీ అంటే కండిషన్స్ అప్లై అనే విషయం ప్రజలు మరిచారు! భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఈ సమయంలో తాజాగా ఉచిత ఇసుక పథకం హామీ అమలు అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే… ఉచితం అంటూనే టన్నుకు రూ.1,394 అని బోర్డు పెట్టింది.

వాస్తవానికి ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు, సీవరేజీ చార్జీలు, మెయింట్నెన్స్ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది బాబు ప్రభుత్వ విధానం! ఇది వరకూ టన్ను ఇసుక తవ్వకానికి కాంట్రాక్టర్ కు రూ.30 వంతున చెల్లించేవారు. సీవరేజీ చార్జీలు కింద 88 రూపాయలు, మెయింట్నెన్స్ ఖర్చుల కింద మరో రూ.20 తీసుకోవాలని నిర్ణయించారు. ఈ లెక్కన ఓ ట్రాక్టర్ లో 5 టన్నుల ఇసుక పడుతుందని అనుకుంటే… రూ.700 నుంచి రూ.800 ధరకే ట్రాక్టర్ ఇసుక దొరకాలి.

కానీ ఇప్పుడు కూడా “ఉచిత ఇసుక” అని చెప్పిన తర్వాత కూడా ఇసుక ధర టన్నుకు రూ.1,394 అని ప్రభుత్వమే బోర్డు పెట్టింది. పైన “ఉచిత ఇసుక” అని బోర్డులో రాసి, అదే బోర్డులో చివర మాత్రం ఇలా ధర నిర్ణయించింది. దీంతో… జుట్టు పీక్కుంటున్నారు వినియోగదారులు. ఈ లెక్కన చూసుకుంటే… ఈ చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరాలంటే సుమారు 4 నుంచి 5 వేల రూపాయలు ఖర్చవుతుందన్నమాట!

దీంతో ఇసుక కోసం వెళ్లిన వినియోగదారులు లబో దిబో మంటున్నారు! ఇసుకతో భారీగా దోచేశారని జగన్ సర్కార్ పై విమర్శలు చేసింది టీడీపీ. అలాంటప్పుడు జగన్ హయాంలో కంటే ఎక్కువ ధరకే ఇసుక దొరికే విధానాన్ని తెరపైకి తేవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి! మరి ఈ విషయంపై ప్రజలు ఎలా ఆర్ధం చేసుకుంటారు.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటుందా.. లేక, బాబు ఈజ్ బ్యాక్ అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి!

ఇదే సమయంలో గతంలో వైఎస్ జగన్ హయాంలో మొదటి రెండేళ్లూ రూ.375 కి టన్ను ఇసుక అందించగా.. 2021కి వచ్చే సారికి టన్ను రూ.375 నుంచి రూ.475 కి పెంచారు. దీనిపై జనసేన తీవ్రంగా విమర్శలు చేసింది. మరి ఇప్పుడు ఉచితం అని ప్రకటించి రూ.1,394కి అమ్మడంపై పవన్ కల్యాణ్ & కో స్పందిస్తారా.. లేక, మాదీ బాబు స్కూలే అని అంటారా.. అదీగాక, ఆ మంత్రిత్వ శాఖలతో జనసేనకు సంబంధం లేదని మరింత లాజిక్ గా మాట్లాడతారా అనేది వేచి చూడాలి!