ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ నిర్వహించింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోన్న విశాఖపట్నం ఇందుకు వేదికైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి రోజు సమ్మిట్ సందర్భంగా 13 లక్షల కోట్ల మేర ‘ఎంవోయూ’లు కుదిరాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినేషన్. పర్యాటకం సహా, వివిధ రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకెళ్ళేందుకు అన్ని అవకాశాలూ వున్న నగరం విశాఖపట్నం, రాష్ట్రంలో రాజధాని అనదగ్గ అన్ని అర్హతలూ విశాఖకు వున్నాయి. అయితే, చంద్రబాబు హయాంలో విశాఖపట్నాన్ని విస్మరించి, అమరావతిని రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే, ఇన్వెస్టర్లు పోటెత్తారు ‘ఏపీ జీఐఎస్’ కార్యక్రమానికి. ఇన్వెస్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ తయారు చేయించింది. అందులో తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదం, మరికొన్ని వస్తువుల్ని వుంచారు. వీటి కోసం కొందరు ఎగబడ్డారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.
అయితే, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఇన్వెస్టర్లు భోజనాలకో, ప్రభుత్వం ఇచ్చే కిట్లకో ఎగబడతారని అనుకోలేం. కానీ, అక్కడ గలాటా జరిగిన మాట వాస్తవం. కొంత విధ్వంసం కూడా చోటు చేసింది. దొరికినదాన్ని దొరికినట్టే ఎత్తుకుపోయారు. ఇదంతా నిర్వహణా వైఫల్యంగానే చెప్పుకోవచ్చు.
అసలు ఇలా ఎలా జరిగింది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలే ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారన్నది ఓ వాదన. కారణాలేవైతేనేం, ఇన్వెస్టర్ల సదస్సులో ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందీ గలాటా.