బడ్జెట్లో ఏపికి ఒరిగిందేమీ లేదు…ఇపుడు కూడా మొండి చెయ్యే

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఎంతో ముఖ్యమైన రాజధాని నిర్మాణం, పోవలరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా లాంటి అంశాలపై అసలు ప్రస్తావనే లేకపోవటం గమనార్హం. అదే సంరద్భంగా విశాఖపట్నం, విజయవాడలో ప్రారంభించాలని అనుకుంటున్న మెట్రో సర్వీసు ప్రాజెక్టుల ఆర్ధిక అంశాల ఊసేలేదు.

ఏదో విదిల్చాలి కాబట్టి ముష్టి విదిల్చినట్లుగా ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ 8 కోట్లు, సెంట్రల్ యూనివర్సిటి ఏర్పాటుకు రూ. 13 కోట్లు ఇస్తున్నట్లు మాత్రం ప్రకటించింది. ఇక పెండింగిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల గురించిన ప్రస్తావన అసలు లేనే లేదు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి పెద్ద చిట్టానే చేతిలో పెట్టి వచ్చారు. అయితే ఆ చిట్టా ఎక్కడో పోయుంటుంది. అందుకనే ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం ఏ విధమైన  సానుకూలత చూపించలేదు. ఐఐటి, నిట్, ఐఐఎం, ఐఐఐటి లకు కనీసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు.

ఈ వివక్ష ఏపి విషయంలోనే కాదు తెలంగాణాకు కూడా పెద్దగా కేటాయింపులు జరగలేదు. ఏదో సెంట్రల్ యూనివర్సిటికి రూ. 80 కోట్లు కేటాయించిటం తప్ప ఒరిగిందేమీ లేదు. చూడబోతే రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం అసలు పరిగణలోకి తీసుకున్నట్లే కనబడలేదు. అంటే గడచిన ఐదేళ్ళల్లో ఏపి విషయంలో చూపిన వివక్షే ఎన్డీఏ 2 లో కూడా కంటిన్యు చేయాలని మోడి సర్కార్ అనుకున్నట్లు అర్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల దెబ్బకు ఏపికి ఏమిచ్చినా ఉపయోగం లేదని మోడి అనుకున్నట్లే అనిపిస్తోంది.