AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలకు ఆరంభం అవుతుంది. బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఇది కీలక వేదికగా మారనుంది.
ప్రస్తుతం ప్రభుత్వం 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే మొదటి రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ అనంతరం ఖచ్చితమైన తేదీలు నిర్ణయించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 27న చర్చకు రానుండగా, బడ్జెట్‌ను 28న ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, తన మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక సూచనలు చేశారు. అసెంబ్లీలో తమ శాఖల పరిధిలోని అంశాలపై పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ విధానాలపై స్పష్టతనిస్తూ, ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు సమర్థవంతంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు.
ఇక ఈ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది. బడ్జెట్‌లో కొత్త పథకాలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ప్రతిపక్ష వైసీపీ తన వ్యూహాన్ని ఎలా సిద్ధం చేసుకుంటుందన్నదీ ఆసక్తిగా మారింది.