ఈవీఎంలు నవ్వుకుంటున్నాయి!

ఆంధ్రప్రదేశ్ లో సావత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసింది. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ఏడో దశ కూడా పూర్తయిన తర్వాత జూన్ 4న ఫలితాలు విడుదలకాబోతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రంలో 400 సీట్లు తమవే అని బీజేపీ చెప్పుకుంటుంది.. అంత సీన్ లేదని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తుంది. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో మాత్రం ఈ చర్చ బలంగా మొదలైంది.

అవును… ఏపీలో అధికారం తమదే అని వైసీపీ బలంగా చెబుతుంది. ఇదే సమయంలో.. అధికారం మాదే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎక్కువ పోలింగ్ నమోదైంది కాబట్టి.. అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది వారి నమ్మకంగా కాగా… ఎక్కువ పోలింగ్ నమోదవ్వడానికి కారణమైన మహిళలు, వృద్ధులు.. తమకు అనుకూలంగా ఓటు వేస్తారని వైసీపీ ధీమాగా చెబుతుంది.

ఇలా ఎవరి ధీమాలో వారున్నారు.. ఎవరి నమ్మకాలను వారు చెబుతున్నారు. అయితే వీటిలో కొన్ని అభిప్రాయాలు నిజంగా నమ్మకాలు కాగా.. మరికొన్ని మాత్రం ఆత్మవంచనలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… పలు సర్వే ఫలితాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో కూటమికి 130+ అని ఒకరు రాస్తే… వైసీపీకి 135 – 140 అని మరొకరు రాస్తున్నారు!

మరి అవి నిజంగా సర్వేలేనే.. లేక, సొంత కవిత్వాలా అన్నది తెలియాల్సి ఉంది! అయితే… వాటిలో సర్వేల పేరున బయటకు వస్తున్న రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అని.. అది కేవలం బెట్టింగ్ రాయుళ్లు ఆడుతున్న డ్రామా అని చెబుతున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల పోలింగ్ అనంతరం లగడపాటి చెప్పిన సర్వే మాటలను గుర్తుచేసుకుంటున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే… ఈ ఎన్నికల్లో గెలిచేది కచ్చితంగా వైసీపీనే అని, జగన్ మళ్లీ సీఎం అవ్వడం కన్ ఫాం అని, ఈసారి విశాఖలో జగన్ జూన్ 9న ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో… ఇంతకు మించిన హాస్యం మరొకటి లేదని చెబుతున్న టీడీపీ నేతలు… అదే డేట్ చెబుతూ… జూన్ 9న చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు.

దీంతో… వైసీపీ నేతలు చెబుతున్నది హాస్యం అని టీడీపీ నేతలు చెబుతుంటే… అసలు టీడీపీ నేతలు కూడా అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం అనేది అంతకు మించి అని ఎద్దేవా చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడం అనేది కల అని బల్లగుద్ది చెబుతున్నారు. ఇలా ఎవరి ధీమా వారు బయటపెడుతున్నారు.

కాకపోతే కొంతమంది ముందుగా కాన్ఫిడెంట్ గా చెబుతుంటే… మనం రియాక్ట్ అవ్వకపోతే బాగోదేమో అని ప్రత్యర్థులూ రియాక్ట్ అవుతుండటం గమనార్హం. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించినా గ్రహించకున్నా, జనాలు నవ్వుకున్నా నవ్వుకోకున్నా… స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచబడిన ఈవీఎం లు మాత్రం నవ్వుకుంటున్నాయని అంటున్నారు.

ఏపీలో ప్రజలు ఓటేశారు.. తమకు ఏ నాయకుడు కావాలనే విషయంపై స్పష్టతతో ఓటేశారని అంటున్నారు.. ఈ సమయంలో ప్రజలు ఎవరి జాతకాన్ని ఎలా రాశారనే విషయం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అందువల్ల తమకంటే ఎక్కువ తెలుసన్నట్లుగా జనాలు గాసిప్స్ మీద గాసిప్స్ చెప్పుకుంటూ.. అది ధీమా అని కలరింగ్ ఇవ్వడంతో ఈవీఎంలు నవ్వుకుంటున్నాయని అంటున్నారు.

కారణం… అందులో ఏముందో వాటికి తప్ప మరొకరికి తెలిసే ఛాన్స్ లేకపోవడమే. సో… ఈవీఎంలు జూన్4 న నేతల భవిష్యత్తు బయటపెట్టబోతున్నాయి… అప్పుడు ఎవరు నవ్వుతారు, ఎవరు ఎవరిని చూసి నవ్వుతారు అనేది తేలిపోతుంది. అప్పటివరకూ కొంతమంది చేసే చిత్రవిచిత్ర జోస్యాలు చూసి ఈవీఎంలు మాత్రం నవ్వుతున్నాయనే అనుకోవాలి!