ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. ఈ సమయంలోనే శనివారం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనిని బట్టి.. ఫిబ్రవరి 7న తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, సహజంగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, తమకు నచ్చిన నాయకుడిని యునానిమస్ గా సర్పంచ్ గా ఎన్నుకునే ఆనవాయితీ ఉంది.
దీనిని ఎన్నికల కమిషనర్ కూడా ఒప్పుకొన్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై మాట్లాడారు. గతంలోనూ ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇకముందుకు కూడా ఏకగ్రీవాలు జరుగుతాయి. అయితే.. కేవలం ఏకగ్రీవాలే జరగాలన్న కాన్సెప్టు మాత్రం మంచిదికాదు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం అని ఆయన ప్రభుత్వ పెద్దల ను ఉద్దేశించి హెచ్చరించారు.
దీనికి ఒక కారణం ఉంది. పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదన్న సర్కారు.. సుప్రీం తీర్పుతో దిగివచ్చిన నేపథ్యంలో ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అన్ని మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు.. ఇలా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని.. కానీ, ప్రభుత్వం మాత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే.. ఈ ఉత్తర్వులు ప్రకటించిందని పేర్కొంటూ.. సీపీఐ, సీపీఎం, టీడీపీ, జనసేన బీజేపీలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదుల చేశాయి. దీంతో ఆయా అంశాలపై దృష్టి పెట్టిన కమిషనర్ నిమ్మగడ్డ.. ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా ఎండగట్టారు. ఈ ప్రకటనలు, జీవోలపై.. చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించిన వివరాలని ఒకసారి చూస్తే .. తాజాగా 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది .