వైసీపీ గత పాలనపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్ల పాత్రపై ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇసుక దోపిడీ నుంచి సినిమా టికెట్ల దాకా అనేక అక్రమాలు జరుగుతుంటే, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థ నిస్సహాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్, జగన్ ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల అప్పు పెరిగిందని ఆరోపించారు. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు కళ్ళు మూసుకుపోయారో అర్థం కావడం లేదని అన్నారు. పాలనలో ఈ తరహా పద్ధతులు కొనసాగితే శ్రీలంక మాదిరి పరిస్థితులు ఏపీకి ఎదురవుతాయనే హెచ్చరిక చేశారు.
పవన్, వైసీపీ పాలనను కేంద్రం వద్ద కూడా ఉదాహరణగా చూపుతుందని, పాలన ఎలా ఉండకూడదో ఈ ప్రభుత్వం తార్కాణమని అన్నారు. కసబ్ వంటి ఉగ్రవాదులు కాకినాడ పోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ వ్యవహారాలు రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పవన్ చంద్రబాబును ప్రశంసించారు. ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్తోందని అన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం వంటి విజయాలు చంద్రబాబుకు సాధ్యమయ్యాయని, ఏపీకి అద్భుత శక్తి ఉన్న నేత అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని స్పష్టం చేశారు.