ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.! కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా.?

ఎలా వుండే కాంగ్రెస్ పార్టీ ఎలా అయిపోయింది.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, తెలుగునాట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ వంతు.. అంటోంది కాంగ్రెస్. కర్నాటక, తెలంగాణ.. తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ‘పాత కాపులు’ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారట.! నిజమేనా.?

వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదే అతి పెద్ద మలుపు.. అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అంత తేలిక కాదు.

తెలంగాణ రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో వుండి, అధికారంలోకి వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీనే లేదు. 2014 ఎన్నికల్లో వెంటిలేటర్ మీదకెళ్ళిన కాంగ్రెస్, 2019లోనూ కోలుకోలేదు.

అయితే, వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దరిమిలా, కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావం కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి పలువురు నేతలు వివిధ కారణాలతో బయటకు వస్తున్న దరిమిలా, వారిలో కొందరికి అయినా కాంగ్రెస్ పార్టీ ఓ ఆప్షన్‌గా కనిపించొచ్చు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఇప్పటికే తాను షర్మిల వెంట రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన వైసీపీకి ఇటీవలే రాజీనామా చేశారు. ఇలాంటి నేతలు ఓ డజను మంది షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీతో నడిస్తే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకునే అవకాశమైతే వుంటుంది.