షర్మిళను ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉందా?

సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీవైపే అందరి చూపూ ఉంటుంది. వారు ఎలాంటి పాలన అందిస్తున్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేస్తున్నారు.. మేనిఫెస్టోను ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారు.. వారు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకూ, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు పొంతన ఉందా అనేది నిత్యం ప్రజలు, ప్రతిపక్షాలూ గమనిస్తూ ఉంటాయి.

వాస్తవానికి (అసలైన) మీడియా కూడా ప్రజల తరుపున ఆయా ప్రభుత్వాలపై ప్రతిపక్ష పాత్రే పోషిస్తుంటుంది. ఇక పలు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అంతా కూడా ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తుంటారు.. గాడి తప్పితే ప్రశ్నిస్తుంటారు.. మాట తప్పితే నిలదీస్తుంటారు.. తప్పు చేస్తే ఎండగడుతూ ఉంటారు. అయితే విచిత్రంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అనే మాటలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయే కూటమిపై వ్యతిరేకత చాలా ఉందని, ఇక బీజేపీ సంగతి అయితే చెప్పే పనే లేదని, బీజేపీ జాతీయ స్థాయిలో పాటు పలు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండటం దాదాపు ఇదే చివరి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వచ్చే సారి ప్రజలు ‘ఇండియా’ కూటమికి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిస్థితులుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎంత సహేతుకంగా ఉంటే అంత మంచింది.

అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్న ఏపీలో మాత్రం ఆ పార్టీ నేతలు చేస్తున్న వరుస తప్పులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా… ఏదైనా రాష్ట్రంలో సత్తా చాటాలి అనుకున్నా, అధికారంలోకి రావాలని భావిస్తున్నా.. అక్కడున్న అధికార పార్టీని టార్గెట్ చేయాలి.. వారి పనితీరును నిశితంగా పరిశీలిస్తూ తగు ప్రశ్నలు సంధించాలి.. ప్రజల తరుపున బలంగా పోరాడాలి. కానీ ఏపీలో షర్మిల చేస్తుందేమిటి?

ఏపీలో ఏ విషయం జరిగినా, ఎంతటి ఘోరం జరిగినా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నోరు మెదపకున్నా… వైఎస్ షర్మిల నోరు మెదపడం లేదు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండు నెలలు అవుతున్న వేళ.. ప్రశ్నించడానికి, పోరాటాలు చేయడానికి ప్రతిపక్షాలకు ఇప్పటికే చాలా అవకాశాలు కల్పించేసింది. బోలెడన్ని గోల్డెన్ ఛాన్సులు ఇస్తుంది!

అయితే ఏపీలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న కాంగ్రెస్ మాత్రం ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం లేదు సరికదా.. ఆ సమస్యలపై పోరాడుతున్న వైసీపీపైనే విమర్శలు చేస్తుంది. దీన్ని రాజకీయ అపరిపక్వత అనాలా.. లేక, రాజకీయ అజ్ఞానం అనుకోవాలా.. అదీగాక, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ ముసుగులో తన వ్యక్తిగత కక్ష తీర్చుకుంటూ.. ఆ పార్టీని ముంచేసే పనిలో భాగం అనుకోవాలా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.

ఇప్పుడు ఏపీలో చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు షర్మిల వైసీపీపై చేసిన విమర్శలను ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు! ఆ పార్టీ విధానాల వల్ల ఇబ్బందులు పడిన వివిధ వర్గాలు ఆమె మాటలను ఆలకించాయి! అయితే ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. అయితే… షర్మిళ ఇపుడు కూడా అదే పనిగా ఆ పార్టీని టార్గెట్ చేస్తుంది. అలా చేయడం వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపు చూడరు అనే వాస్తవాన్ని మరిచిపోతున్నట్లుంది!

జగన్ ని విమర్శించేస్తే, వైసీపీ వీక్ అయితే ఆ స్థానంలోకి తాము వెళ్లవచ్చు అన్నది ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యూహం కావచ్చు. కానీ అలా జరిగేందుకు అవకాశాలు ఏమాత్రం లేవు అనే అంటున్నారు పరిశీలకులు. వైసీపీని జగన్ ని ఎంతగా టార్గెట్ చేస్తే ఆ పార్టీ వైపు జనాల ఆసక్తి అంతగా మళ్ళుతుంది. కొన్ని సార్లు సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం మరిచిన షర్మిళ… ఏపీలో టీడీపీకి బీ టీం లా కాంగ్రెస్ పార్టీని మారుస్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనర్ బాలికపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.. మహిళలకు ఇచ్చిన “తల్లికి వందనం” హామీని ఈ ఏడాది అటకెక్కించారు. అయినప్పటికీ ఈ విషయాలపై షర్మిళ నోరు మెదపడం లేదు. పైగా… ఈ సమస్యలపై పోరాడుతున్న జగన్ ని విమర్శించి.. వివేకానందరెడ్డి గురించి ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించే స్థాయికి దిగిపోయారు!!

ఈ వ్యూహాలతో ముందుకు వెళ్తున్న వైఎస్ షర్మిళ ఏపీలో ఇప్పటికే భూస్థాపితం అయిన కాంగ్రెస్ పార్టీని మరింత అదఃపాతాళానికి తొక్కేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదా.. లేక, ఏపీలో పార్టీ మనుగడను లైట్ తీసుకున్నారా.. అనేది తెలియాల్సి ఉంది.