అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధిత కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను దోషులని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
కాగా, సీఎం ప్రకటించిన పరిహారం చట్టపరంగా బాధిత కుటుంబానికి అందాల్సిన సాయానికి ఇది అదనం. దళిత మహిళపై కనుక అత్యాచారం జరిగితే చట్టపరంగా రూ. 8.25 లక్షల పరిహారం లభిస్తుంది. మరోవైపు, బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 4,12,500 మంజూరు అయింది. ఈ మేరకు మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
అలాగే, ఇంటి స్థలంతోపాటు స్నేహలత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందజేస్తామన్నారు. స్నేహలత హత్యపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గురువారం ఆమె అనంతపురంలో స్నేహలత కుటుంబసభ్యులను పరామర్శించారు.