ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం – 1946 లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలిచ్చింది. సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో… ఈ విషయంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
ఒక్కసారి వెనక్కి వెళ్తే… రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని కేంద్రం వినియోగించుకుంటోందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బీజేపీతో విభేదించిన తర్వాత చంద్రబాబు కూడా ఇదే కారణం చెబుతూ ఉపసంహరించారు! అయితే ఇప్పుడు తిరిగి ఎన్డీయేలో భాగంగా ఉన్నందునో ఏమో కానీ… చంద్రబాబు సర్కార్ సీబీఐకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జరీ చేసింది!
అయితే… ఈ సందర్భంగా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం పలు కండిషన్స్ ముందు పెట్టింది. ఇందులో భాగంగా… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే నేరుగా విచారణ చేసేందుకు అనుమతి ఉంది.. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇదే సమయంలో… జూలై 1 నుంచే ఈ గెజిట్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది!
ఇదే సమయంలో... ఏపీలోకి వచ్చిన సీబీఐ సొంతంగా కేసులు పెట్టే అవకాశం ఉండదు.. కేంద్ర పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు కానీ.. మిగిలిన విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు మాత్రమే పనిచేయాలి, లేదా.. కోర్టులు ఆదేశించాలి.
ఇలా అయిదేళ్ళ క్రితం ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అని పేర్కొంటూ ఒక ఉత్తర్వును తెచ్చారు. అప్పట్లో ఎన్డీయేతో టీడీపీకి రాజకీయ బంధం కటీఫ్ అవ్వడమే దానికి కారణం అనే కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో కీలకమైన నిర్ణయంగా సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ని రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం నాడు తీసుకున్నారు. అదే చంద్రబాబు ఇపుడు స్వయంగా వెల్ కం చెప్పడం విశేషం.
ఇది మారిన ప్రభుత్వ వైఖరికి నిదర్శనంగా చూడాలా.. లేక, ఇపుడు కూడా కేంద్రంలో మోడీ సర్కారే ఉన్నప్పటికీ.. టీడీపీ – బీజేపీల మధ్య మంచి రాజకీయ మైత్రి కొనసాగుతోంది.. పైగా ఎన్డీయే సర్కార్ కి బాసటగా టీడీపీ ఉండటంతో చంద్రబాబుకు ప్రస్తుతానికి ధైర్యం వచ్చేసిందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా… చంద్రబాబు మార్కు నిర్ణయం తాజాగా తెరపైకి వచ్చింది.