ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో షాపులు రీ ఓపెన్ చేసి 25 శాతం ధరలు పెంచి విక్రయించారు. సోమవారం వైన్ షాపుల ముందు ఉన్న సన్నివేశాన్ని బట్టి జగన్ ఆ ధరలు 50 శాతం అధికం చేసారు. మొత్తంగా 75 శాతం పెంచిన ధరలతో మద్యం విక్రయాలు జరగాలని ఆదేశాలు జారీ చేసారు. దీంతో ప్రభుత్వంపై ఓకింత మద్యం బాబులు ఆగ్రహం చెందారు. ఏకంగా 75 శాతం పెంచడం అంటే పెను భారమవుతుందని విమర్శలు గుప్పించారు. అయితే వాళ్లందరికి జగన్ సూటిగానే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మద్యపానాన్ని నిరుత్సాహ పరచాలంటే రేట్లు పెంచాల్సిందేనని ఖరాకండీగా చెప్పేసారు. కావాలనే అధికారులతో చర్చించి ఒకేసారి 75 శాతం పెంచాం.. మద్యంపై తమ ఎజెండాను అమలు చేస్తానని తాను అధికారంలోకి రాకముందే వెల్లడించానని.. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నానని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే 33 శాతం లిక్కర్ షాపులు తగ్గించామని, మరో 13 శాతం కూడా తగ్గిస్తామని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారేదని, కానీ ఇప్పుడా పరిస్థితులు ఎక్కడా లేదని స్పష్టం చేసారు. మద్యం తాగే వారి సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గుతోందని ఇది శుభ సూచికమని, రానున్న రోజుల్లో తాను చెప్పింది చెప్పినట్లు చేసి చూపిస్తాని ఉద్ఘాటించారు.
ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా మద్యంపై లాభపేక్ష లేకుండా పని చేస్తుందన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, మహిళామణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందు బాబులను అదుపు చేయాలంటే? ప‌్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతోనే ముందుకెళ్లాలని..ఇదొక్కటే మార్గం అని అంటున్నారు. జేబునిండా డబ్బులున్నా ఫుల్ గా తాగే వాడు..ఇప్పుడు హాఫ్ తాగుతున్నాడని ఇది మార్పుకు మొదటి మెట్టు అని అభిప్రాయపడ్డారు. అయితే ఇలా ధరలు పెంచడం వల్ల అక్రమ ఆగడాలు ఎక్కువతాయని ఓకింత ఆందోళన వ్యక్తమవుతోంది. నాటు సారా, గంజాయి వంటి వాటి జోలికి వెళ్లే ప్రమాదముందంటున్నారు. వాటిపై జిల్లా స్థాయి, మండల, పంచాయితీ స్థాయిలో అధికారులు, పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవరించాలని కోరుతున్నారు.