Chandrababu: ఆర్థికాభివృద్ధిలో వేగం పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్తగా “లాజిస్టిక్స్ కార్పొరేషన్”ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇది దేశంలో మొట్టమొదటి లాజిస్టిక్స్ ప్రత్యేక కార్పొరేషన్‌గా నిలవనుంది. ఈ కొత్త నిర్ణయం ద్వారా పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, పోర్టుల అభివృద్ధి మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడనుంది.
ఈ కార్పొరేషన్ ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించనుంది. తొలి దశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం, దుగదర్తి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాదిలోపు నాలుగు పోర్టులు, నాలుగు హార్బర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటు స్టేట్ లెవెల్ రోడ్లను నేషనల్ హైవేలు, పోర్టులతో కలపాలన్న లక్ష్యంతో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు.
ఈ కార్పొరేషన్ పర్యవేక్షణలో తీసుకొచ్చే ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడటం వల్ల పరిశ్రమలకు, రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పని చేసే రహదారుల మెరుగుదలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న చంద్రబాబు, అవినీతికి తావు లేకుండా వ్యవస్థ నడవాలన్న ఉద్దేశం తనదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా లాజిస్టిక్స్ రంగాన్ని శక్తివంతం చేయాలన్న దిశలో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారే అవకాశముంది.