రామోజీని వెంటాడుతున్న ఏపీ సీఐడీ… లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కేసులో రామోజీకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు ఏపీ సీఐడీ అధికారులు! వరుసపెట్టి కార్యాలయాలపై దాడులు చేసిన అధికారులు… ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. దీంతో… ఆ సమాచారాన్ని చేతిలోపెట్టుకుని దూకుడు ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా మరోసారి రామోజీ ఇంటితలుపు పట్టింది ఏపీ సీఐడీ.

జూబ్లీహిల్స్‌ లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు మరోసారి చేరుకున్నారు. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కేసులో ఎండీ శైలజా కిరణ్‌ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుపుతోందని తెలుస్తుంది. అయితే… మార్గదర్శి నుంచే రామోజీ గ్రూప్‌ కంపెనీలకు ఫండ్స్‌ మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు శైలజా కిరణ్ స్టేట్ మెంట్ ను తీసుకుంటున్నారు!

ఇక్కడ ఏపీ సీఐడీ అధికారులు ఈపని చేస్తుంటే… మరోవైపు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా… మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్న పిటిషన్లను, ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఫలితంగా విచారణ వేగవంతం అవ్వడానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది!!

ఇదే విషయాలపై ఏపీ ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌… సి.ఆర్.పి.సి. సెక్షన్‌ 406 రెడ్‌ విత్‌ 139 ఏ కింద పిటిషన్‌ దాఖలు చేశామని.. ఆర్టికల్‌ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని వివరించారు.

కాగా, మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఏపీ సీఐడీ ఇటీవలే అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శికి సంబంధించిన రూ.798.50 కోట్ల విలువైన చరాస్తులు దర్యాప్తు సంస్థ అటాచ్‌ చేసింది. ఇదే క్రమంలో క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌ లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది.