ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ.! సాధ్యమయ్యే పనేనా.?

‘కొన్ని రోజుల్లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవుతుంది. కొన్ని నెలల్లో నేను విశాఖకు వచ్చేస్తాను..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశాక, అసలు ఈ పరిస్థితుల్లో విశాఖకు రాజధాని హోదా సాధ్యమేనా.? అన్న అంశం చుట్టూ ఇంకోసారి లోతైన చర్చ జరుగుతోంది.

నిజానికి, రాజధాని విషయంలో విశాఖపట్నంకి అన్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలోనే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయి వుండాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, విశాఖపట్నంకి సహజంగానే దక్కిన ‘హక్కు’లా భావించాలి.. రాజధాని విషయాన్ని. కానీ, కొన్ని రాజకీయ శక్తులు విశాఖకు ఆ ‘రాజధాని హోదా’ దక్కకుండా అడ్డుకున్నాయన్నది నిర్వివాదాంశం. రైల్వే జోన్‌ని కూడా విశాఖకు దక్కనీయకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు కొందరు. ఆ కారణంగానే ఇప్పటికీ విశాఖ రైల్వే జోన్ ఓ కొలిక్కి రాలేదు.

సరే, అమరావతిని నాశనం చేసి.. విశాఖను రాజధాని చేయాలని ఎవరూ కోరుకోరు. లక్ష రూపాయలు అమరావతి పేరుతో ఖర్చు చేసినా.. అది ప్రజా ధనమే. అలాంటిది, వేల కోట్లు అమరావతిలో రాజధాని పేరుతో ఖర్చు చేశారు. ఆ సొమ్మంతా ప్రజలదే. అలాంటప్పుడు, అమరావతిని కాదని విశాఖను ఎలా రాజధానిగా చేయగలరు.?

నాలుగేళ్ళలో చేతకానిది, ఏడాది కాలంలో వైఎస్ జగన్ ఎలా చేస్తారన్నదీ పాయింటే మరి.! కానీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వైఎస్ జగన్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నారు. దీన్నే మూర్ఖత్వమంటారంటూ విమర్శలు ఆయన మీద గట్టిగానే వస్తున్నాయ్. ఏమో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.