రాజధానిగా విశాఖపట్నం.! కానీ, ఎలా.?

విభజన చట్టంపైనా సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతూ సాగుతూ వుంది. ఎప్పటికి తేలుతుందో అది.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం అయితే రెండుగా విడిపోయింది. రెండు రాష్ట్రాల్లో ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా రాజధానుల వ్యవహారం కూడా సుప్రీంకోర్టులో వుంది. మూడు రాజధానుల బిల్లుని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ నుంచి వెనక్కి తీసుకుంది. మరోమారు అసెంబ్లీలో ఆ బిల్లు పెడితే తప్ప, మూడు రాజధానుల గురించి మాట్లాడటానికి వీల్లేదు.

పైగా, ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో వుంది. అయినాగానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మూడు రాజధానులే తమ విధానం అంటున్నారు. కొత్తగా, ‘విశాఖపట్నమే రాజధాని’ అని కూడా చెబుతున్నారు. అంటే, అమరావతినీ, కర్నూలునీ గాలికొదిలేసినట్టేన్నమాట. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖ పరిపాలన రాజధాని.. అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

కోర్టు పరిధిలో వున్న అంశంపై ఇలా ముఖ్యమంత్రి నుంచి ప్రకటనలు రావొచ్చా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే, త్వరలోనే విశాఖ నుంచి పాలన అని వైసీపీ తెగేసి చెబుతుండడం గమనార్హం. సుప్రీంకోర్టులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. త్వరగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మూడు రాజధానుల అంశంలో వైసీపీ సర్కారు ముందడుగు వేయడానికి వీల్లేదని, ఏకైక రాజదాని అమరావతి మాత్రమే కొనసాగుతుందనీ భావించాల్సి వస్తుంది. పరిస్థితి ఇంతగా స్పష్టమవుతున్నా, వైసీపీ.. అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం రాజధాని మార్పు అంశంపై ధీమాగానే వున్నారు.