సోము వీర్రాజు జంప్ జిలానీ ఆట బావుందే!
ఎన్నికలకు ఇంకో నాలుగేళ్లు ఉండగానే ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారపక్షం వైకాపా దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎవరికి వారు మంత్రదండం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ తేదేపా పూర్తిగా వీకైపోవడం.. చంద్రబాబు నాయుడు వయసు సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని జనసేనాని పవన్ కల్యాణ్ రీయాక్టివేట్ అవుతున్నారట. ఆ క్రమంలోనే జనసేనానితో భాజపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నయా భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ ని హైదరాబాద్ లో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముచ్చటించారు. అంతేకాదు.. జనసేనతో కలిసి బీజేపీ ప్రణాళికలకు సంబంధించిన కీలక అంశాల్ని ఈ భేటీలో ముచ్చటించారు.
ముఖ్యంగా ఆ ఇద్దరి భేటీలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అంశంపైనే చర్చ సాగింది. ఆర్థికంగా సామాజికంగా నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికా బద్ధమైన ప్లాన్ చేసేందుకు ఈ కలయిక అని తెలుస్తోంది. త్వరలో ఉభయులు సమావేశమై 2024 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అధికారంలోకి వచ్చే విధంగా జాయింటుగా ప్రణాళికల్ని రూపొందిస్తారట. అలానే రాజధాని మార్పు సహా అమరావతిలోని రైతులు సమస్యలపైనా రకరకాల అంశాల్ని చర్చించాలని పవన్ – వీర్రాజు ద్వయం నిర్ణయించుకున్నారు.
అయితే అన్నయ్య చిరంజీవి వైకాపా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే ఆయనను కలిసిన వీర్రాజు.. ఇంతలోనే తమ్ముడు పవన్ కల్యాణిని కలవడం వెనక లాజిక్కు ఏంటో అర్థం కావడం లేదు. జనసేనాని ఆశీస్సులు తీసుకుని అమరావతిపై పోరాడుతారు. అలాగే అన్నయ్య ఆశీస్సులతో గుట్టు లీకవ్వకుండా వైకాపాకి అండగా నిలుస్తారా? ఎన్నికల మూవ్ మెంట్ ని బట్టి సందర్భాన్ని బట్టి సోము ఆడే జంప్ జిలానీ ఆటా ఇది?