అట్టర్ ప్లాప్ సినిమా: వీర్రాజు దర్శకత్వం – బాబు పర్యవేక్షణ!

ఏపీలో బీజేపీ పరిస్థితికి సోము వీర్రాజే కారణమా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఏ ఎన్నికైనా సరే.. ఫలితం మాత్రం సేం! నోటాతో పోటీ – చెల్లని ఓట్లతో ఫైటే లక్ష్యంగా ఏపీలో బీజేపీ రాజకీయాలు సాగుతున్నాయి. సీనియర్ లీడర్లు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమైపోవడం, వారిని వ్యూహాత్మకంగా బాబు సైకిల్ ఎక్కించేసుకోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు సోమువీర్రాజు ఒంటెద్దు పోకడలు.. నేల విడిచి సాముచేసే మాటలు.. ప్రధాన కారణంగా తెలుస్తుంది.

తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్ల కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయ్. ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీట్లో చెల్లని ఓట్లు పన్నెండు వేలపై చిలుకు వస్తే.. బీజేపీకి వచ్చినవి పదకొండు వేలు! ఇక తూర్పు రాయలసీమలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఆరు వేల కంటే తక్కువకాగా.. ఇక్కడ చెల్లని ఓట్లు పదిహేడువేలు! ఈ లెక్కలు సరిపోతాయి… ఏపీలో బీజేపీని సోము వీర్రాజు ఏస్థాయిలో ముందుకు తీసుకుపోతున్నారో చెప్పడానికి.

యువకుల మద్దతు ఎక్కువగా ఉందని చెప్పుకునే జనసేన పార్టీతో పొత్తులో ఉంది.. వారిని కలుపుకుని పోవడంలో వీర్రాజుకి ఉన్న ప్రోబ్లం ఏమిటో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పుకోవడమే తప్ప.. ఇక్కడ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. పైగా జనసేన మద్దతు తమకే అని సోము వీర్రాజు చెప్పుకుని బ్రతుకుతారు తప్ప… ఆ మాట పవన్ తో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటింపచేసుకోలేరు. ఇది కచ్చితంగా వీర్రాజు లోపమే అని అంటున్నారు కాషాయ కార్యకర్తలు.

సోము వీర్రాజు చేతకానితనం, అసమర్ధత సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో బీజేపీ పతనానికి పరోక్షంగా చంద్రబాబు కూడా కారకుడనే కామెంట్లు నిత్యం రాజకీయవర్గాల్లో వినిపిస్తుంటాయి. అవును… ఏపీలో బీజేపీని బలపడనివ్వకుండా చేయడంలో చంద్రబాబు నిత్యం తన వ్యూహాలు తాను పన్నుతుంటారని.. అందులో భాగంగా సోము వీర్రాజు బలవుతున్నారని.. కలిసి రావాల్సిన వారు సైతం బాబు కనుసన్నల్లో బ్రతుకుతూ.. వీర్రాజుకు కలిసిరావడం లేదనే వాదన కూడా లేకపోలేదు!

ఎందుకంటే… కేంద్రంలోని బీజేపీ పెద్దలు పవన్ ను చేరదీసి, ఏపీ బీజేపీ నేతలకు బలమైన వ్యక్తిని అందిస్తే… బాబు సైడ్ ట్రాక్ నుంచి పవన్ కు కన్నుకొడుతుంటారు.. కనుసన్నల్లో పెట్టుకుంటుంటారు! ఇదే సమయంలో.. గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి నేతలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏవిధమైన సపోర్ట్ చేయకుండా టీడీపీకి పరోక్షంగా సపోర్ట్ చేశారని.. అదంతా బాబు వ్యూహాల్లో భాగమే అని అంటున్నారు విశ్లేషకులు!

అంటే… ఏపీలో బీజేపీ నాశనం అయిపోవడానికి, వెంటిలేటర్ పై ఉండి ఇవ్వాలో రేపో అనే పరిస్థితికి రావడానికి కారణం… సోము వీర్రాజు అసమర్ధతకి తోడు బాబు సమర్ధత కూడా కారణం అని అంటున్నారు రాజకీయ పండితులు. మరి ఇకనైనా సోము వీర్రాజులో చలనం రావాలని, కనీసం చీమకుట్టిన స్పర్శ అయినా తెలియాలని.. ఫలితంగా పవన్ ని దగ్గరచేసుకుని, కలుపుకుపోవాలని, కలిసిపోవాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్. అలాకానిపక్షంలో… సోము పరిస్థితి సోంపాపిడే!