రిజర్వేషన్‌ బిల్‌.. ఏపీలో మహిళల స్థానాలు ఇవేనా?

కర్ణాటక ఎన్నికల ముందు చాలా కాన్ ఫిడెంట్ గా కనిపించిన బీజేపీ పెద్దలు… ఆ ఫలితాల అనంతరం చెమటోడ్చక తప్పదనే పరిస్థితి వెళ్లారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆ ఫలితాల అనంతరం దక్షిణాధిలో దారులు మూసుపోతున్నాయనే కామెంట్లు కూడా వినిపించడంతో… వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కొత్త ఎత్తులు వేస్తుంది.

అవును… వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మరోసారి గెలవడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అంటున్నారు. ఇందులో భాగంగా… ఈ నెల 19 దాన్ని తొలుత లోక్‌ సభలో ప్రవేశపెట్టింది.

ఇక గురువారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో మహిళలకు ఎన్ని సీట్లు లభిస్తాయి? ఏయే సీట్లు లభించవచ్చని ఆసక్తికర చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ లోనూ మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

ఈ లెక్క్న చూసుకుంటే… ప్రస్తుతం ఏపీలో లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 33 శాతం రిజర్వేషన్‌ అంటే సుమారు 58 సీట్లు శాసనసభలో మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇదే క్రమంలో… ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 33 శాతం అంటే… సుమారు 8 స్థానాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం (9.20 లక్షల మహిళలు), గుంటూరు(8.82 లక్షలు), నరసరావుపేట (8.58), నెల్లూరు(8.55), తిరుపతి (8.50 – ఎస్సీ రిజర్వుడ్‌), అనంతపురం (8.48), నంద్యాల (8.38), విజయవాడ (8.30 లక్షల మంది) లోక్‌ సభ నియోజకవర్గాలను మహిళలకు కేటాయిస్తారని అంటున్నారు.

ఇదే సమయంలో 58 నియోజకవర్గాలు ఇలా ఉన్నాయని అంటున్నారు. వీటిలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే… భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక, శ్రీకాకుళం, ఇచ్చాపురం, విజయనగరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొత్తపేట, పోలవరం (ఎస్టీ), భీమవరం, చింతలపూడి (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ, గన్నవరం, మైలవరం, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు (ఎస్సీ), గుంతకల్లు, పలమనేరు, మాచర్ల, వినుకొండ, రాయదుర్గం, మదనపల్లె, కావలి, జమ్మలమడుగు, పాయకరావుపేట (ఎస్సీ), చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, పాణ్యం, రంపచోడవరం (ఎస్టీ), పెందుర్తి, గురజాల, విశాఖ ఉత్తరం, కోవూరు, కర్నూలు, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, కడప, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, రాయచోటి, రాప్తాడు, ఆలూరు, కదిరి, ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి ఉన్నాయి.

ఈ 58 నియోజకవర్గాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఫలితంగా… 33 శాతం రిజర్వేషన్ అమలులోకి వస్తే… ఈ సీట్లలో ప్రధానంగా మహిళలే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారు!