ఢిల్లీ పర్యటనతో ఏమన్నా ఉపయోగం ఉంటుందా ?

వచ్చే నెల మొదటివారంలో జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. జెరూసలేం నుండి తిరిగి వచ్చిన తర్వాత 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉంటారు. తన పర్యటనలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోడితో కూడా భేటీ అవుతారు. సరే ఎలాగూ ఢిల్లీలోనే రెండు రోజులుంటారు కాబట్టి కొందరు కేంద్రమంత్రులను కూడా కలుస్తారనుకోండి అది వేరే సంగతి.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ ది ఇది రెండో పర్యటన. ఇక్కడ విషయం ఏమిటంటే మొదటి పర్యటనలో కూడా నరేంద్రమోడితో పాటు కొందరు కేంద్రమంత్రులను జగన్ కలిశారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై అనేక విజ్ఞప్తులను అందించారు. ఏదో పెండింగ్ లో ఉన్న కొన్ని నిధులను విడుదల చేయటం తప్ప కేంద్రం నుండి పెద్దగా సానుకూలత కనబడలేదు.

మొదటివారంలో చేయబోయే రెండో పర్యటన లక్ష్యం కూడా సేమ్ టు సేమ్. ముఖ్యమంత్రి కాగానే తనను కలిసిన జగన్ ను మోడి గట్టిగా హత్తుకోవటం తప్పించి చేసిందేమీ లేదనే చెప్పాలి. నిజానికి మోడి-జగన్ మధ్య పెద్దగా మిత్రత్వం కానీ శతృత్వం కానీ లేదనే చెప్పాలి.

కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి సొంతంగానే ఏపిలో ఎదగాలని చూస్తున్న బిజెపి జగన్ ను శతృవుగా పరిగణిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి  సాధించిన అఖండ విజయంతో బిజెపికి జగన్ కెపాసిటీ ఏమిటో అర్ధమైపోయింది. దాంతో ఏపి ప్రయోజనాలపై సానుకూలంగా స్పందిస్తే క్రెడిట్ మొత్తం జగన్ కే వెళితే బిజెపికి పుటగతులుండవని అర్ధమైపోయింది. అందుకనే జగన్ ను పెద్దగా పట్టించుకోవటం లేదని అర్ధమైపోతోంది.