విజయవాడకు చెందిన పోతిన వెంకట మహేష్‌కి వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించినా, గుంటూరు రాజకీయ గడ్డపై తొలి అడుగే కాస్త డీలా పడింది. ఇటీవల గుంటూరు పార్లమెంట్ ఇంచార్జిగా నియమితులైన ఆయన, పార్టీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించాలనుకున్నారు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతనికి ఎదురైన అనుభవం తలదించుకునేలా చేసింది.
పార్టీని బలోపేతం చేసేందుకు పని ప్రారంభించిన పోతిన… అక్కడి సీనియర్ నేతలకు ఫోన్లు చేసి, పార్టీ వ్యూహాలను చర్చిద్దామన్నారు. కానీ ఆశించిన స్పందన రాలేదు. ఇద్దరు మాత్రమే స్పందించగా, మిగతా వారు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇది పోతిన్‌కి కలిగిన మొదటి రాజకీయ సెగ. ముఖ్యంగా, పక్కా సీనియర్లు కొత్తవారిని అంత సులువుగా ఒప్పుకోరనే వాస్తవం ఇక్కడ వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే పార్టీలో చేరిన నేతగా, పైగా జనసేన నుంచి వచ్చిన వ్యక్తిగా పోతినకి స్థానికంగా సానుభూతి అంతగా లేదు. అలాంటి పరిస్థితుల్లో పెద్దలతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఫోన్ ద్వారా పిలుపు పెట్టినా స్పందించకపోవడం వల్ల, పార్టీ అంతర్గత వర్గాలలో అసంతృప్తి ఎంత ఉందో స్పష్టమవుతోంది.
ఇప్పటివరకు ఈ ఘటనపై పోతిన తరఫు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, గుంటూరుకు స్వయంగా వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఫోన్ పని చేయకపోతే ప్రత్యక్షంగా వెళ్లి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నది ఆయన యోచన.
అయితే సీనియర్ నేతల అసహనాన్ని ఎలా సర్దుబాటు చేస్తారు? బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు మున్ముందు ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు? అన్నదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఈ ప్రారంభ ఆటుపోట్లను అధిగమించి, గుంటూరు రాజకీయాల్లో పోతిన తనదైన ముద్ర వేయగలిగితే తప్ప… ఈ బాధ్యతలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.