జగన్ మరో కీలక నిర్ణయం.. పార్టీలకు అతీతంగా “డోంట్ వర్రీ”!

ప్రతిపక్షాలు పూర్తిగా విమర్శలను నమ్ముకుంటూ, సావాళ్లు విసురుకుంటూ ముందుకు వెళ్తున్న వేళ జగన్ మాత్రం తన ఓటు బ్యాంకును. తాను పూర్తిగా నమ్ముకున్న, తనను పూర్తిగా నమ్ముకున్న జనాల విషయంలో మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలు పొత్తులతో ముందుకు వెళ్లాలని ఫిక్సవుతున్నట్లు కథనాలొస్తున్న వేళ.. తాను మాత్రం తనకంటూ ఉన్న ఓటు బ్యాంకును మరింత పెంచుకునేలా ముందుకు పోతున్నారు.

ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, మరెవరు ఇంకెన్ని ఎత్తులు వేసుకున్నా.. జగన్ మాత్రం తనను సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు. పేద ప్రజలకు తానే మొదటి ఆఫ్షన్ అని నమ్మకంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త ఆలోచనకు తెరలేపారు. ఇందులో భాగంగా… పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పథకాలు పూర్తి స్థాయిలో అందించాలని భావిస్తున్నారు.

దీంతో… ఈ సమయంలో “జగనన్న సురక్షా” కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా వచ్చినా, వారి అనుకూల మీడియా తనపై దుమ్మెత్తి పోస్తున్నా… తాను మాత్రం దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని చెబుతున్నారు. ఈ సమయంలో పథకాల లబ్దిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు “జగనన్న సురక్షా” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఇప్పటికే మొదలుపెట్టిన “జగనన్నకు చెబుదాం” కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వాలంటీర్లు సచివాలయాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. అనంతరం వారికి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. ఇదే సమయంలో ఈ కార్యక్రమంలో భాగంగా… వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న ఆ పథకాలను మంజూరు చేస్తారు.