రామోజీకి గ్యాప్ ఇవ్వడం లేదు… మార్గదర్శికి మరో భారీ షాక్‌!

ఇప్పటికే మార్గదర్శి పేరు చెప్పి రామోజీరావుకి గ్యాప్ ఇవ్వకుండా షాకులిస్తున్న ఏపీ ప్రభుత్వం… తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకూ చందాదారుల డిపాజిట్లు పక్కదారి పట్టించి వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారని రామోజీరావుపై అభియోగాలున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా పెద్దపెద్ద బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు నిధులు మళ్లించినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో భారీ షాకిచ్చింది.

తవ్వేకొద్దీ వెలుకులోకి వస్తున్న మార్గదర్శి అక్రమాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్న ఏపీ సీఐడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా రూ.242 కోట్లను అటాచ్ చేసింది. గతంలో రూ.793 కోట్లు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అంటే… విచారణలో భాగంగా ఇప్పటివరకూ రెండుసార్లు ఆస్తులను అటాచ్ చేశారన్నమాట.

అయితే తాజా వ్యవహారంతో… మొత్తం 40 సంస్థలకు మార్గదర్శి నిధులు మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ జారీచేసిన జీవోలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా… డీమార్ట్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్ మార్కెట్స్, భారతి ఎయిర్‌టెల్, సెంచరీ టెక్స్‌ టైల్స్ వంటి సంస్థలకు నిధులను మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది!

కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ… ఆ కంపెనీ అధినేత రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌ లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు, డిపాజిట్‌ దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది.