జగన్ కు తలనొప్పిగా తయారైన అన్న క్యాంటిన్లు

అన్న క్యాంటిన్ల నిర్వహణ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారైంది. మంత్రుల మధ్య సమయన్వయం లేకపోవటం, అసెంబ్లీలో మంత్రి ఒక ప్రకటన చేస్తే క్షేత్రస్ధాయిలో మరొకటి జరుగుతుండటం ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరొస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే పేదలకు భోజనం పెట్టేందుకని దాదాపు ఏడాదిక్రితం చంద్రబాబునాయుడు అన్న క్యాంటిన్లు ప్రారంభించారు. అసలైతే  ఈ క్యాంటిన్లు ఐదేళ్ళ క్రిందటే ప్రారంభించాలి. కానీ ఇచ్చిన హామీని నిలుపుకునే అలవాటు లేదు కదా ? అందుకనే నాలుగేళ్ళు పేదలను  మోసం చేసి ఎన్నికలు ముందు క్యాంటిన్లు ప్రారంభించారు. ఇందులో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు తమ్ముళ్ళు.

సరే క్యాంటిన్లను ప్రారంభించారు పేదలకు మూడుపూటలా సక్రమంగా భోజనం పెట్టారా అంటే అదీలేదు. పూటకు ఓ 400 మందికి కొన్ని క్యాంటిన్లలో భోజనం పెట్టామనిపించి క్యాంటిన్ ను మూసేసేవారు. అంటే క్యాంటిన్లు నడిచినంత కాలం అడ్డదిడ్డంగానే నడిపారన్నది వాస్తవం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటిన్ల స్ధానంలో రాజన్న క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

అందుకని తాత్కాలికంగా క్యాంటిన్లను మూసేశారు. అన్న క్యాంటిన్ గదుల పెయిటింగ్ లను మార్చేయటం, అన్న క్యాంటిన్లన్న పేరుకు బదులు రాజన్న క్యాంటిన్లని రాయించటం లాంటి పనుల కోసం తాత్కాలికంగా మూసేశారు. దాన్ని అవకాశంగా తీసుకున్న పచ్చదళం రెచ్చిపోతోంది. వాళ్ళకు ఎటూ ఎల్లో మీడియా తోడవుతుంది కదా ? ఇంకేముంది రచ్చ పెరిగిపోతోంది. ఈ విషయాలను జగన్ ముందుగానే ఊహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుంటే ఏ గోలా ఉండేది కాదు. ఇప్పటికైనా జగన్ మేలుకుని తొందరగా ఈ వివాదానికి ముగింపు పలికితే బాగుంటుంది.