ధమ్మున్న మాట మాట్లాడిన అనిల్ కుమార్!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఈ ఫలితాలు సృష్టించిన, సృష్టిస్తున్న కాక అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు పొగలు సెగలు రేపుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ ససెప్షన్ కి గురైన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యెలు నెల్లూరు జిల్లావారే కావడంతో… నెల్లూరు వైకాపా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో మైకందుకున్నారు నెల్లూరు వైసీపీ నేత, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.

“ఆనం, మేకపాటి, కోటంరెడ్డి… ఈ ముగ్గురూ ఇప్పుడు పోటీ చేయలేకపోతే మళ్లీ పోటీచేసే అవకాశం ఉండదు. వయస్సు కూడా ఉండదు. మీకు పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి. నాదేమో పిట్ట చరిత్ర. రాజకీయంగా నేను చాలా చిన్నవాడిని. చంద్రశేఖరన్నా.. మీకు‌ టిక్కెట్టు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్‌ గా పోటీచేస్తే సింగిల్ డిజిట్ వస్తుందో, డబుల్ డిజిట్ వస్తుందో‌ చూద్దాం” అంటూ ఫైరయ్యార్ అనిల్ కుమార్!

ఈ సందర్భంగా అనీల్ చేసిన ఒక ఛాలెంజ్ పార్టీ వర్గాలతోపాటు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. “ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లడం వల్ల నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు. 2024 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు గెలిచినా.. నేను మళ్లీ నెల్లూరులో అడుగుపెట్టను. ఒకవేళ అదే జరిగితే.. నా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాను. ఈ విషయంపై నా దగ్గరికి ఎవరైనా రండి.. కావాలంటే బాండ్ పేపరు మీద రాసి సంతకాలు పెట్టుకుందాం” అంటూ అనీల్ చేసిన ఈ ఛాలెంజే ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందనేది స్పష్టం చేస్తుంది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై తనకున్న భక్తిని చాటుకునే ప్రయత్నం కూడా చేశారు అనీల్. రాబోయే ఎన్నికల్లో జగన్ తనకు టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా… పార్టీలోనే ఉంటాను అని అనిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం జగన్ ఫోటోతో గెలిచినవారే… ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తా అంటూ వ్యాఖ్యానించారు.

అనిల్ చేసిన ఈ సవాళ్లపై నెటిజన్లు, సొంత పార్టీ కార్యకర్తలతోపాటు ఇతర పార్టీల కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. “చిల్లర చిల్లర ఛాలెంజ్ లు కాకుండా… సరైన సమయంలో సరైన ఛాలెంజ్ ఇది – ఇంతకు మించిన ఛాలెంజ్ ఉండదు – ఆ ముగ్గురూ ఈ ఛాలెంజ్ కు ఒప్పుకోవాలి – బాండ్ కాగితాలు రాసుకోవాలి” అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో… “ధమ్మున్న మాట మాట్లాడారు” అంటూ సోషల్ మీడియాను హోరెత్తించేస్తున్నారు అనిల్ అభిమానులు!