ప్రస్తుతం ఏపీలో మూడు పార్టీలూ (అనధికారికంగా రెండు) ఎవరి వ్యూహాల్లో అవి బిజీగా ఉన్నాయి. మూడు పార్టీల అధినేతలూ మూడు చోట్ల కొలువుదీరి భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. రేపటి అడుగులపై కార్యకర్తల్లో అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. దీంతో మే 27 ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన రోజుగా మారబోతోంది!
మే 27 న జగన్ ఢిల్లీలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమిత్ షా, మోడీలతో విడివిడిగా భేటీ అవుతారు. మే 26న ఆర్థికమంత్రితో చర్చలు జరుపుతారు! నీతి ఆయోగ్ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొంటారు. అది కామనే కానీ.. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలు, పొత్తుల ప్రేమల నడుమ ఈ భేటీ అత్యంత కీలకం!
రాబోయే ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ లతో కలిసి నడవాలని జనసేన అధినేత మనసా వాచా కర్మణా కోరుకుంటున్నారు! పైకి చెప్పుకోవడానికి సీనియార్టీ అడ్డొస్తున్నా… బాబు మనసులో మాట కూడా ఇదే అనేది తెలిసిన విషయమే! అయితే ఏపీ ఎన్నికల్లో బీజేపీ తోడు జగన్ కోరుకోవడం లేదు. జగన్ బలం ఉన్న వర్గాల్లో బీజేపీకి వ్యతిరేకత ఉండటమే దీనికి కారణం! కానీ…. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరకూడదని మాత్రం బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది!
పైగా… బయటకు అధికారికంగా చెప్పకపోయినా దక్షిణాధిలో రెక్కలు తెగిపోయిన బీజేపీకి… దూరంగా జగన్ ఒక్కరే ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. రేపటి రోజున కేంద్రంలో అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఏదైనా సహాయం అవసరమైతే చేయగలిగే స్థాయిలో జగన్ ఉంటారని బీజేపీ పెద్దలు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆర్థికంగా కూడా ఏపీకి నిధులు విడుదల చేస్తూ… జగన్ ను పరోక్షంగా జనాల్లో మరింత బలపరుస్తున్నారు.
ఇక మరోపక్క మంగళగిరిలో పవన్ సీక్రెట్ గా తిష్ట వేశారు. సర్వే రిపోర్టులు పరిశీలిస్తూ… పొత్తులో భాగంగా ఏయే నియోజకవర్గాలు అడగొచ్చు అనే విషయాలపై రహస్య మంతనాలు జరిగిస్తున్నారు. లెక్కలు వేసుకుంటున్నారు.. పొత్తులో సీట్ల ఎంపికపై అంతర్గత చర్చలు నడుపుతున్నారు.
ఇదే సమయంలో మే 27న రాజమండ్రి కేంద్రంగా చంద్రబాబు “మహానాడు” కార్యక్రమాన్ని జరిగించబోతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మహానాడు చంద్రబాబుకు అత్యంత కీలకం. ఇప్పటికైనా పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు, నాన్చుడు ధోరణిలో నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్లని పక్షంలో… ఈసారి టీడీపీకి అత్యంత కష్ట దశ జరిగే ప్రమాధం ఉంది! ఈ మహానాడుకు అత్యధికంగా జనసమీకరణ చేయాలని కూడా టీడీపీ బలంగా పథకాలు రచిస్తోంది.
ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే… రాబోయే రాజకీయాలకు మే 27 అనేది ఏపీలోని మూడు రాజకీయ పార్టీలకూ కీలకం కాబోతుందన్నమాట!