అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం.! ఎందుకబ్బా.?

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు అమెరికాలో, రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి రాజకీయం ఇంకాస్త కొత్తగా కనిపిస్తోంది. అదీ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకులు, అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విభాగం తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, సజ్జల భార్గవ రెడ్డి అమెరికా వెళ్ళి, అక్కడి వైసీపీ సానుభూతిపరులతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే.

తాజాగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అమెరికాలో పర్యటిస్తున్నారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా అమెరికాలోనే వున్నారు. అక్కడి తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ ఇరువురూ పాల్గొంటున్నారు.

అయితే, తెరవెనుకాల రఘురామకృష్ణరాజు, బాలకృష్ణ చేస్తున్న రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు, తనను తాను టీడీపీ సానుభూతిపరుడిగా అమెరికాలోని ఎన్నారైల వద్ద ప్రచారం పొందుతున్నారు.

సాధారణంగా ఈ తరహా వ్యవహారాలు, ఆయా పార్టీలకు నిధుల సేకరణ కోసం వేదికలుగా మారుతుంటాయి. ఎన్నికల సమయంలో, ఎన్నారైలు.. ఆయా పార్టీల తరఫున, కొందరు అభ్యర్థుల తరఫున ప్రత్యేకంగా ఖర్చు చేయడం కొత్త విషయమేమీ కాదు. అలా, నిధుల సమీకరణ కోసం నాయకులు అమెరికా వెళుతున్నారా.? అన్న కోణంలో బోల్డన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిధుల సంగతేమోగానీ, అమెరికాలో వుండే కొందరు ఎన్నారైలు.. ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలకు అనుబంధంగా కొనసాగుతుంటారు. అలా తమకు సోషల్ మద్దతు అమెరికాలోని ఎన్నారైల నుంచి పూర్తిస్థాయిలో లభించేందుకూ.. నేతలకు ఈ తరహా పర్యటనలు ఉపయోగపడతాయి.