స్థానికంగానూ గట్టిగా కొట్టిన జగన్!

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏ ముహూర్తాన్న వచ్చాయో కానీ… నాటి నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీ తన హవా కొనసాగిస్తూనే ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా.. ఉప ఎన్నికైనా.. నేడు ఎమ్మెల్సీ ఎన్నికైనా… పోటీ ఏదైనా గట్టిగా కొడుతున్నారు జగన్! ఇలా వరుసగా కొట్టిన దెబ్బ కొట్ట కుండా కొడుతుండటంతో ప్రతిపక్షాలకు తేరుకునే గ్యాప్ కూడా ఉండటం లేదు!

తాజాగా జరిగిన స్థానికసంస్ధల కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎమ్మెల్సీ స్ధానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ దఫా మొత్తం తొమ్మిది స్ధానాలను భర్తీ చేయాల్సి ఉండగా… ఇందులో ఐదుస్ధానాలను ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న పరిస్థితి. ఇక మిగిలిన నాలుగుస్థానాలకూ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలోని రెండుస్ధానాల్లో వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. స్ధానికసంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు వైసీపీకి నల్లేరుమీద నడకే అని అందరికీ తెలుసు.

స్ధానికసంస్ధల్లో సుమారు 90 శాతం వైసీపీ ఖాతాలోనే ఉండగా… బలం లేకపోయినా పోటీలో నిలబడి టీడీపీ బంగపడింది. ఈ నెల 13న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావుకు 632 రాగా… ఆయనపై పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్ధికి 108 ఓట్లొచ్చాయి. ఇక కర్నూలులో వైసీపీ తరపున పోటీచేసిన డాక్టర్ మధుసూదన్ కు 988 ఓట్లొచ్చాయి. అదేవిదంగా పశ్చిమగోదావరి జిల్లాలో అధికారపార్టీ తరపున పోటీచేసిన కవురు శ్రీనివాసరావు 481 ఓట్లు రాగా.. వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లొచ్చాయి.