ఆప్షన్ లేదు… తాకట్టుకు రామోజీ ఫిలిం సిటీ!?

మార్గదర్శి కేసు విషయంలో ఇప్పటికే జగన్ ఆల్ మోస్ట్ రామోజీని నొక్కిపెట్టేశారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. దానికి కారణం… ఏపీ సిబి సిఐడి మార్గదర్శి సంస్థకు సంబంధించి 793 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అంతేకాదు… దీనికి సంబంధించి ప్రధాన ఖాతాను తన ఆధీనంలో పెట్టుకుంది. దీంతో… ఈ డబ్బు మొత్తం ఇప్పుడు ఏపీ సీఐడీ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇదే ఇప్పుడు రామోజీ మరోసారి బెడ్ ఎక్కడానికి బలమైన కారణం అవుతుందని అంటున్నారు! దానికి సంబంధించిన అసలు కథ ఇప్పుడు చూద్దాం!

మార్గదర్శి అయినా, మరో సంస్థ అయినా ఆర్థిక సమస్యలు సహజం! అయితే వీటిలో ప్రధాన ఖాతా (ఫూల్ అకౌంట్) మాత్రం యాక్టివ్ గా ఉండాలి. అలా ఉంటే… ఆ సమస్య నుంచి ఎంతో కొంత బయటపడటానికి వీలుంటుందని అంటుంటారు! వాస్తవానికి ఇలా అటాచ్ చేయడం ద్వారా మార్గదర్శి డబ్బులు ఇతర సంస్థల్లోకి మళ్లించడం ఏమాత్రం సాధ్యం కాదు. దీంతో జగన్ నేరుగా రామోజీ ఆయువుపట్టుని తన ఆధీనంలో పెట్టేసుకున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు రామోజీకి వచ్చిన అసలు సమస్య!

అయితే… గతంలోనూ మార్గదర్శిలో సంక్షోభం ఎదురైంది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యవర్తిగా ఉండి రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చారు. ఈటీవీ తెలుగు మినహా మిగతా ఛానల్స్ తో పాటు.. సోమాజిగూడ లోని ‘ఈనాడు’ ప్రధాన కార్యాలయాన్ని రిలయన్స్ కంపెనీకి విక్రయించేలా మద్యవర్తిత్వం చేసి సుమారు 2,300 కోట్లు రప్పించగలిగారు! అయితే ఇప్పుడు రామోజీ ముందు ఏ ఆప్షన్ ఉందనేది ఆసక్తిగా మారింది!

ఏపీ సీఐడీ ఆరోపిస్తున్నట్లు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్లు జరగకుండా… తన ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు రామోజీ పూనుకుంటే… మార్గదర్శి బోర్డు తిప్పకుండా ధైర్యంగా నిలబడగలిగితే… గతంలోలాగా ఇప్పుడు కూడా ఆస్తులు తాకట్టు పెట్టడమో లేదా విక్రయించడమో చేస్తారని నిపుణులు అంటున్నారు. అయితే… ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారనేది ప్రశ్న.

అయితే… కేవలం 793 కోట్ల విషయంలో రామోజీరావు అంతగా వణికిపోడని, ఆయన ఆర్థికంగా చాలా బలంగానే ఉన్నారని మరికొందరు అంటున్నారు. అయితే ఇక్కడే ఉంది అసలు లాజిక్. గతంలో మార్గదర్శి సంక్షోభంలో ఉన్నప్పటికీ డబ్బులు రొటేషన్ అవుతుండటం వల్ల రామోజీరావు పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. పూల్ ఖాతా / ప్రధాన అకౌంట్ ను ఏపీ సీఐడీ అధికారులు స్తంభింపజేసేశారు! కాబట్టి… మార్గదర్శిలో రొటేషన్ చేయడానికి ఛాన్స్ లేదు!

దీంతో… ఈసారి అమ్మేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేటన్ని ఛానల్స్ కూడా లేవు కాబట్టి.. రామోజీ ఫిలిం సిటీని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది! మరి ఈ ప్రచారానికి సంబంధించిన పూర్తి విషయాలు, వాస్తవాలు తెలియాలంటే వేచి చూడాలి!