రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ రాజకీయం వేరే. అన్ని జిల్లాల్లో ఆధిపత్య పోరు మాటల, ఎన్నికల వరకే పరిమితమైతే సీమలో మాత్రం దాడుల వరకు ఉంటుంది. దీన్నే ఒకపుడు ఫ్యాక్షనిజం అనేవారు. కొన్ని దశాబ్దాల పాటు సీమ రాజకీయాలను ఈ ఫ్యాక్షనే శాసించింది. తెలిసి కొందరు ఈ ఫ్యాక్షన్ లోకి అడుగుపెడితే తెలియక, తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దారిలేక అడుగుపెట్టినవారు ఇంకొందరు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ రాజకీయాలోకి దిగిన నేత పరిటాల రవీంద్ర. కుటుంబ కక్షల కారణంగా మొదలైన ఈ ఫ్యాక్షన్ సాంప్రదాయం ఇరు వర్గాలు రాజకీయ అండ కోసం ప్రయత్నించే తరుణంలో రాజకీయ ఫ్యాక్షన్ కిందికి మారిపోయింది. ఎప్పుడైతే పోరాటం కుటుంబాల నుండి పార్టీల మధ్యకు మారిపోయిందో శత్రువులు, ప్రత్యర్థుల సంఖ్యా కూడ పెరిగిపోయింది.
ఈ రాజకీయాల్లోనే పరిటాల రవీంద్ర టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. ఆనాడు ఎన్టీఆర్ చేయి అందించడంతో మొదలైన రవి రాజకీయ ప్రస్థానం చంద్రబాబు సారథ్యం వచ్చే నాటికి కూడ అప్రతిహతంగా కొనసాగింది. మంచో చెడో ఫ్యాక్షన్ బాట పట్టిన లీడర్లంతా ఆ ఫ్యాక్షన్ భూతానికి బలయ్యారు. పరిటాల రవి సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లీడర్ల మధ్యన నడిచిన ఈ ఘర్షణలు అనుచరగణాలను కూడ పెద్ద ఎత్తున బలితీసుకున్నాయి. ఒక నాయకుడి కోసం పదుల సంఖ్యలో అనుచరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ రాజకీయాలతో అనంతపురం ప్రజలు ఉక్కిరిబిక్కరయ్యారు. తప్పు పాలనా వైపుందని చెప్పలేక ఈ గొడవలు సమసిపోతే బాగుండని అనుకున్నారు. పోలీసులు, నాయకుల చొరవతో కొన్నేళ్లుగా అనంతలో ఫ్యాక్షన్ మాట వినబడలేదు.
ఇకపై కూడ ఇలాగే ఉండాలని ఆశించారు జనం. అయినా కూడ ఆ భూతం నివురుగప్పిన నిప్పులానే ఉంది. కదిపితే కార్చిచ్చు అయ్యేలా కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న, ఎవరు పదవుల్లో ఉన్నా జిల్లా ప్రజలు కోరికునేది ఒక్కటే.. అయిందేదో అయిపోయింది. పాత గొడవలను మళ్ళీ కడపవద్దని. కానీ కొందరు లీడర్లు అడపాదడపా ఆ పొరపాటు చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ఏపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవీంద్ర మీద ఫ్యాక్షనిస్ట్, రక్తపుటేర్లు పారించాడని అంటూ చేసిన వ్యాఖ్యలు కలవరాన్ని రేపుతున్నాయి. పరిటాల కుటుంబం ఎక్కడ ఘాటుగా స్పందిస్తుందోనని ఆందోళన చెందారు.
తాజగా పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని హెచ్చరించారు. పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని, నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిక చేశారు. మళ్ళీ దీనికి ఎంపీ నుండి కౌంటర్ రావడం, మళ్ళీ పరిటాల వర్గం ఏదో ఒకటి అనడం ఇలా మాట్లా మాటల పెరిగి మళ్ళీ పాత గొడవలు మొదలవుతాయేమోనని భయపడుతున్నారు. ఇకనైనా నేతలు పరస్పర విమర్శలు మానేస్తే మంచిదని అంటున్నారు.