(లక్ష్మణ్ విజయ్)
తెలుగుదేశం పార్టీ లో మర్యాదగా ఉంటూ, 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయకుండా, పార్టీ వదిలేసి ఏదో సాధించాలనుకున్నాడు ఆనం రామ్ నారాయణ్ రెడ్డి. ఇది బెడిసికొట్టేలా ఉంది.
వైసిపిలో ఆయనకు పట్టు ఎర్ర తివాచి పరచి స్వాగతం చెబుతారనుకున్నారు. అలాంటిదేమీ జరగడం లేదు. ఎన్ని సార్లు ఆయన జగన్ ని కలిశాడు. సాధించేమీ లేదు. ఇపుడేమయింది. ఆయన వైసిపిలో కాలుమోపేందుకు కూడా జాగా లేదు. పార్టీలోకి వస్తే రాగాని, ఏమీ ఆశించొద్దు, టికెట్ విషయం అసలు చెప్పనేంలేం, సర్వే లనుబట్టి మీజాతకం ఉంటుందని చెప్పారట. సర్వేలేవీ ఆయనకు అనుకూలంగా లేవని విశ్వసనీయ సమాచారం.

ఆయన రెండు నియోజకవర్గాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి ఆత్మకూరు. ఇది తనకు బలమయిన నియోజకవర్గం అని దానిని తనకు ఇస్తే గెలుస్తానని ఆయన భావిస్తున్నారు. అయితే, అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే, జగన్ ని ముఖ్యమయిన వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆత్మకూర్ నై అనేశారు. ఆత్మకూరు లేకపోతే, వెంకటగిరి అయినా పర్వాలేదు అని ఆయన భావిస్తున్నారు. వెంకటగిరి పరిస్థితి ఆయనకు ఏమాత్రం అనుకూలంగా లేదు.ఈ నియోజవకర్గంలో చాలా కాలం నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముగ్గురు నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారు వైసిపి నియోజకర్గం ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అదేవిధంగా యాక్టివ్ గా ఉన్న పారిశ్రామికవేత్త కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి, ఇక మూడో వ్యక్తి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆయన బిజెపి వదిలేసి వైసిపిలోకి రావాలనుకుంటున్నారు. ఈ టికెట్ కోసం బేరం సాగిస్తున్నారు. ఎందుకంటే, నేదురు మల్లి కుటుంబానికి నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది. ఆయన ఆశిస్తున్నారు.
దీనికితోడు, ఆనం సోదరులు టిడిపికి వచ్చినపుడు అనేక మంది ఆయన అనుచరులు కూడా పార్టీలోకి వచ్చారు. అయితే, ఇపుడు ఆనం వైసిపిలో చేరాలనుకుంటునా, ఆయన అనుచరులు టిడిపిలోనే ఉండాలనుకుంటున్నారు. ఆనంతో కలసి పార్టీ మారేందుకు సుముఖంగా లేరని విశ్వసనీయ సమాచారం. వారంత వెంకటగిరి టిడిపిఎమ్మెల్యే రామకృష్ణ తో ఉంటున్నారు. ఇది వైసిపి గమనించినట్లు సమాచారం. ఆనం మీద జరిపిన ప్రాథమిక సర్వేలలో ఇది బయటపడిందని,అందువల్ల ఆనంకు పెద్దగా సపోర్టు లేదని వైసిపినేతకు తెలియడంతో ఆయన ఎలాంటి హామీ, ఇవ్వకుండా పార్టీ లోకి రావాలంటే రావచ్చు, టికెట్ ఆశించవద్దని అన్నట్లు సమాచారం. అయినా, సరే యువనాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆనం రిటైర్ కావలసిందే. అలాంటపుడు గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వదలానుకోవడం ఏమిటి?
నెల్లూరు జిల్లాలో ఆనం రాజకీయాలు
ఆనం రామ్ నారాయణ్ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి 2014 దాకా జిల్లా రాజకీయాలలో కీలక పాత్రవహించారు. ఆనారోగ్యంతో ఇటీవల వివేకానందరెడ్డి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ విభజన, రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం వారి రాజకీయాలను మసక బరిచాయి. విభజన తర్వత వచ్చిన కొత్త రాజకీయాలలో వారికి చోటు లేకుండా పోయింది. దానితో సోదరులిద్దరు 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇపుడు ఎన్నికల ముందు టిడిపి వదిలేసి రామ్ నారాయణ్ రెడ్డి వైసిపిలో చేరాలనుకుంటున్నారు. రామ్ నారాయణ్ రెడ్డి గురించి కొన్ని విషయాలు:
నిజానికి రామ్ నారాయణ్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమయిందే టిడిపి నుంచి. 1983లో నెల్లూరు అసెంబ్లీ స్థానంనుంచి ఆయన టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. అపుడు సోర్ట్స్ అధారిటీ (శాప్) ఛెయిర్మన్ గా నియమితులయ్యారు.
రెండో దఫా మధ్యంతర ఎన్నికల్లో 1985లో రాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీయర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.
అయితే, 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఏడాది కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు ఆనం సోదరులు కాంగ్రెస్ లోకి వచ్చారు.
అయితే, 1994 ఎన్నికలో రామ్ నారాయణ్ రెడ్డి (రాపూర్ ), వివేకాందరెడ్డి (నెల్లూరు) ఓడిపోయారు
తర్వాత రామ్ నారాయణ్ రెడ్డి 1999,2004,2009 ఎన్నికల్లో గెలిచారు. జిల్లారాజకీయాలను శాసించారు. రోశయ్య మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు కూడా అదే పదవిలోకొనసాగారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో, విభజన మీద ఆంధ్ర ప్రజలలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉండటంతో 2014 ఎన్నికల్లో ఆనం సోదరులు పోటీ చేయలేదు. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.