నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినప్పుడు, వివేకానందరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఆనం కుటుంబం జిల్లా రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలిగింది. రాష్ట్ర స్థాయిలో ఒక్క ముఖ్యమంత్రి పదవి మినహా మిగతా అన్ని పదవులను ఆ కుటుంబ నేతలు అలంకరించారు. వైఎస్ మరణానంతరం రామనారాయణరెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం కూడ వినిపించింది. వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యల కేబినెట్లో ఆనం కుటుంబం మంత్రి పదవులను పొందింది. కానీ రాష్ట్రం విడిపోవడం, కాంగ్రెస్ కుప్పకూలడంతో ఆనం రాజకీయాలకు బ్రేకులు పడ్డాయి. చేసేది లేక టీడీపీలో చేరిన వారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. కానీ అక్కడ కూడ ఇమడలేకపోతున్నారు. ఇక వివేకానందరెడ్డి మరణంతో పరిస్థితులు మరింత దిగజారాయి.
వివేకా ప్రోద్భలంతోనే రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ కొన్ని విబేధాల మూలంగా ఆ కుటుంబానికే ఎదురుతిరిగారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి ఆనం కుటుంబం ప్రభ తగ్గుతూ వచ్చింది. తాను మొదటిసారి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు ఓడిపోవడానికి ఆనం కుటుంబమే కారణమని అనిల్ కుమార్ అభిప్రాయం. అందుకే వారికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడ ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడంతో జిల్లా మీద పూర్తి పట్టు పెంచుకున్నారు. ఆనం కుటుంబం నుండి రామనారాయణరెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలవడంతో నెల్లూరు సిటీకి దూరం కావాల్సి వచ్చింది. ఆనం వివేకా వారసుడిగా రాజకీయాల్లో ఉన్న రంగమయూర్ రెడ్డి సిటీలో అనిల్ కుమార్ ఉధృతి ముందు నిలవలేకపోతున్నారు.
ఈ పరిస్థితుల నడుమ తాజాగా ఆనం జయంతి సందర్బంగా సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు రంగమయూర్ రెడ్డి. రామనారాయణరెడ్డి సైతం వేడుకల్లో పాల్గొనడానికి సిటీకి వచ్చారు. ఆ సమయంలోనే వివేకా ఫోటో ఉన్న ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటుచేసిన కొద్దిసేపటికే తొలగించారు. దీంతో రంగమయూర్ రెడ్డి రగిలిపోయారు. బెట్టింగ్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్లిన వారి ఫ్లెక్సీలను మాత్రం తొలగొంచరు కానీ వివేకా ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారు అంటూ పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్, ఆయన సోదరుడు రూప్ కుమార్ యాదవ్ మీద విమర్శలు గుప్పించారు. త్వరలోనే నెల్లూరు రాజకీయాల్లో మార్పు చూస్తారని హెచ్చరించారు. ఇక కుటుంబ పెద్ద రామనారాయణరెడ్డి కూడ రంగమయూర్ రెడ్డి భుజం తడుతూ ఇకపై రాజకీయం మొత్తం నెల్లూరు నుండే నడుస్తుందని, తమ కుటుంబం శక్తి సామర్థ్యాలు ఏంటో చూస్తారని అనడంతో రగడ తారా స్థాయికి చేరుకుందని అర్థమవుతోంది.
అనిల్ కుమార్ యాదవ్ జగన్ కేబినెట్లో కీలకంగా ఉన్నారు. జగన్ వద్ద ఆయన పలుకుబడి తిరుగులేదు. పైగా జిల్లాకు చెందిన మరొక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడ అనిల్‌కు మద్దతుగానే ఉన్నారు. రామనారాయణరెడ్డి చూస్తే అధిష్టానం మీద అసహనంతో పార్టీలో ఉందామా వద్దా అనే మీమాంసలో ఉండగా హైకమాండ్ సైతం ఆయన్ను లైట్ తీసుకున్నట్టే వ్యవహరిస్తోంది. రానున్న మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పదవి దక్కకపోతే జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది.