బిగ్ అలెర్ట్: పవన్ కు గతం గుర్తుచేస్తున్న విశ్లేషకులు… సూచనలు చేస్తున్న పరిశీలకులు!

ఏపీలో ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రోహిణీ కార్తి ఎండలను మించి రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని జిల్లాలు తిరిగేస్తున్నారు.. ఇక జగన్ కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. అయితే ఈ సమయంలో పవన్ మాత్రం పొలిటికల్ మ్యాథ్ మెటిక్స్ చేసుకుంటూ, వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో పవన్ కు కొన్ని సూచనలు చేస్తున్నారు పరిశీలకులు!

పవన్ కల్యాణ్ ఈమధ్య మంగళగిరిలో సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుని.. సర్వే రిపోర్ట్ తెప్పించుకుని.. ఏయే జిల్లాల్లో, ఏయే నియోజకవర్గాల్లో ఎంతెంత బలం ఉందనే విషయంపై సీరియస్ గా చర్చలు జరిపారని తెలుస్తుంది. అంతవరకూ ఓకే కానీ… అసలు విషయం మరిచిపోతున్నారు పవన్! అదే జనాల్లోకి వెళ్లడం!! ప్రస్తుతం పవన్ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. అవన్నీ పూర్తవ్వాలంటే సంక్రాంతి వచ్చేస్తుందని సమాచారం.

అయినా పవన్ కు ఒక ధైర్యం ఉంది. అదే చంద్రబాబు. తన తరుపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేసుకుంటూపోతున్నారు. ఈ వయసులో కూడా బాబు ఎక్కడా తగ్గడంలేదు. సరే, ఎంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. నిత్యం జనాల్లో ఉండటానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో పవన్ పూర్తిగా నాదెండ్ల మనోహర్ కి పార్టీ రాజకీయాలు అప్పగించేసి, చంద్రబాబుకు జనాల్లో తిరిగే బాధ్యత పెట్టేసి, తానుమాత్రం సినిమాలు చేసుకుంటే 2014 తర్వాత టీడీపీ నేతలు చెప్పిన మాటలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది!

ఇప్పటికే పవన్ తీరుతో జనసైనికులు డీమోరలైజ్ అయిపోతున్న పరిస్థితి. “మా వాడికే సీరియస్ నెస్ లేదు… ఇక మాకెందుకండి” అనే స్థాయి మాటలు అప్పుడే గోదావరి జిల్లాల్లో వినిపిస్తున్నాయి! పైగా… ఈ రోజున చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అందరి సాయం అడుగుతున్నారు. రేపటి రోజున చంద్రబాబు అధికారంలోకి వస్తే.. సింగిల్ గా మెజారిటీ వస్తే… పవన్ ని టార్గెట్ చేసి పక్కన పెట్టేస్తారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు!! 2014లో చంద్రబాబు గెలుపులో పవన్ పాత్రను తీసిపారేయలేం. కానీ… గెలిచిన అనంతరం కొంతమంది ముదురు నేతలతో… “తన అన్ననే గెలిపించుకోలేకపోయాడు, చంద్రబాబుని గెలిపించాడా..” వంటి మాటలు మాట్లాడించారు బాబు. ఈ విషయం పవన్ మరిచిపోకూడదు.

ఇదే సమయంలో రేపు ఒకవేళ జనసేన కూడా కొద్దో గొప్పో సీట్లు గెలిచి… టీడీపీకి భారి మెజారిటీ వస్తే… పవన్ కూడా తనవల్లే గెలిచాడు, ఒంటరిగా వెళ్లి ఉంటే 2019 లాగా రెండు చోట్లా ఓడిపోయేవాడు అని కామెంట్ చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. సో… ఇప్పటికైనా మించిపోయింది లేదు. పవన్ పొత్తుల సంగతి అలా ఉంచి, సొంత పార్టీని తీర్చిదిద్దుకుని, క్యాడర్ ని లీడర్స్ ని బలంగా నిలబెట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఫలితంగా 2024 తరువాత రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు మారినా జనసేనకు పెద్దగా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది.

అలా కాకుండా పూర్తిగా చంద్రబాబుపై ఆధారపడిపోయి, ఎన్నికల నాటికి తనవెనకున్న జనాలను సైకిల్ ఎక్కించేసి ఏదో ప్రతిఫలం పొందేద్దాం అనుకుంటే మాత్రం… తల బొప్పి కట్టేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఈ సూచనలు వింటారా.. లేక, బాబు రాజకీయ చాణక్యం ఇంకా అర్ధం కాక మరో అనుభవాన్ని రుచి చూస్తారా అన్నది వేచి చూడాలి!