టీడీపీ నేతలను ఫాలో అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే.. విసుగెత్తిపోతున్న జనం ?

ఉత్తరాంధ్ర ఓటర్లకు వలస నేతలను ఆదరించే అలవాటు ఎక్కువ.  వాళ్ళు పార్టీని చూస్తారే తప్ప  అభ్యర్థిని చూడరనే టాక్ ఉంది.  అందుకే రాజకీయంగా కొత్త అడుగులు వేయాలనుకునే నేతలకు ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా కలిసొచ్చాయి.  అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  కారణం వలస నేతల నిర్లక్ష్య వైఖరే.  ఆదరించిన జనానికి దగ్గరగా ఉండాల్సిన నాయకులు సొంత ఊళ్లలోనే ఉంటూ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అక్కడి జనం  మండిపడుతున్నారు.  అందుకు ఉదాహరణే అనకాపల్లి నియోజకవర్గం. 

Anakapalle voters angry on Gudivada Amarnath
Anakapalle voters angry on Gudivada Amarnath

అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి అనేకమంది నాన్ లోకల్ నాయకులు గెలుపొందారు.  గెలవకముందు అంటే స్థానికేతరులు కాని గెలిచిన తర్వాత కూడ మేము నాన్ లోకల్ అన్నట్టుగానే  వ్యవహరించారు.  ఈ రకమైన రాజకీయం చేసిన వారిలో టీడీపీ లీడర్లే ఎక్కువ.  2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పీలా గోవింద సత్యనారాయణ సొంత ఊరు పెందుర్తిలోనే ఉంటూ రాజకీయం చేశారు.  ఇక తాజాగా అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరపున 1999లో గెలిచిన గంటా శ్రీనివాసరావు  విశాఖలో ఉంటూ అనకాపల్లి ప్రజలకు అప్పుడప్పుడు మాత్రమే  కనబడేవారు.  అలాగే 2014లో తెలుగుదేశం టికెట్ మీద నెగ్గిన అవంతి శ్రీనివాస్ సైతం విశాఖలో ఉంటూ తన అనుచరులతో పని కానిచ్చేవారు.  

Anakapalle voters angry on Gudivada Amarnath
Anakapalle voters angry on Gudivada Amarnath

ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సైతం అదే తరహా పాలిటిక్స్ చేస్తున్నారట.  గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొందిన ఈయన నియోజకవర్గానికి మరీ నల్లపూస అయ్యారట.  ఎప్పుడో కానీ కనిపించట్లేదట.  ఎవరైనా మంత్రులు, ఇతర ముఖ్యనేతలు అనకాపల్లి పర్యటనకు వస్తే తప్ప ఎమ్మెల్యేను చూడటం గగనమైందని చెప్పుకుంటున్నారు అక్కడి నేతలు.  గత లీడర్లు చేసినట్టే ఆయన కూడ విశాఖలో ఉంటూ అనకాపల్లిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని తన అనుచరగణంతో కథ నడుపుతున్నారట.  ఇప్పటికే ఇలాంటి రిమోట్ పాలన చూసి విసిగిపోయిన జనం ఆ కోపం మొత్తాన్ని అమర్నాథ్ మీద వెళ్లగక్కుతున్నారట. ఈయన కూడ టీడీపీ లీడర్ల మాదిరిగానే స్థానికేతర పాలన చేస్తున్నారని, ఇలాగైతే అభివృద్ధి మాటేమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారట.